CM on Dharani । ఇదీ కేసీఆర్‌ తెచ్చిన ‘ధరణి’ గుట్టు! : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచనల వ్యాఖ్యలు

ఈ కార్ రేస్ పై ఏడాదిగా చర్చ జరుగుతున్నా... అసెంబ్లీలో నాలుగు సమావేశాల్లో ఎప్పుడైనా దీని గురించి మాట్లాడారా?. నిన్నటి నుంచి రేసుపై చర్చ జరగాల్సిందే అని బీఆర్ఎస్ పట్టుబడుతున్నారు.. ఎందుకీ అహంకారం...?. ఏడాదిగా అవసరంలేని చర్చ ధరణి గురించి చర్చ వచ్చిప్పుడే ఈ రేసు గురించి ఎందుకు? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆరెస్‌ సభ్యులనుద్దేశించి అన్నారు.

CM on Dharani । ఇదీ కేసీఆర్‌ తెచ్చిన ‘ధరణి’ గుట్టు! : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచనల వ్యాఖ్యలు

CM on Dharani । తన మెదడును రంగరించి, అమృతం తీసి ఒక అద్భుత భూ చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆనాడు సభలో కే చంద్రశేఖర్ రావు చెప్పారని, తీరా చూస్తే.. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదు, ఒడిశా రాష్ట్రంలో ఈ-ధరణి విఫలం కావడంతో ఒక ప్రైవేటు కంపెనీ తెలంగాణలో అదే పేరుతో ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిండు సభలో కేసీఆర్‌ పరువు తీశారు. ‘2010లోనే ఒడిశాలో ఈ-ధరణి పేరుతో IL&FS (సత్యం కంప్యూటర్స్) కంపెనీకి అప్పగించింది. ఎలాంటి అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఈ-ధరణి పోర్టల్ ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుపట్టింది. అలాంటి లోపభూయిష్టమైన ధరణిని కేసీఆర్ ఎందుకు తెలంగాణ ప్రజలపై రుద్దారో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని వివరించారు. శుక్రవారం భూ భారతి 2024 బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… 2018లో IL&FS తో పాటు గదె శ్రీధర్ రాజుకు చెందిన e centric, wissen infotech సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయని తెలిపారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్లలో నిషేధించే విధానం ఉన్నా.. కేసీఆర్ ఆ పని చేయలేదన్నారు. భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలు ప్రైవేటు కంపెనీకి అప్పగించారని, ఆ తరువాత IL&FS సబ్సిడరీ కంపెనీ అయిన టెరాసిస్ ధరణి కాంట్రాక్టును దక్కించుకుందని తెలిపారు. ‘ఈ టెర్రాసిస్ లో 99 శాతం షేర్లు ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన Falcon SG అనే సంస్థ రెండు దఫాలుగా 2021 లో కొనుగోలు చేసింది. మిగిలిన ఒక్క శాతం వాటా మాత్రం అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మిత్రుడు గదె శ్రీధర్ రాజు కొనుగోలు చేశారు. ఆ ఒక్క శాతం షేరుతో శ్రీధర్ రాజు టెరాసిస్ కు సీఈవోగా అవతారం ఎత్తారు. Falcon SG (ఫిలిప్పిన్స్) సంస్థలోని 100 శాతం షేర్లు సింగపూర్ కు చెందిన Falcon investments (Singapore) అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ సింగపూర్ కేంద్రంగా ఉన్న కంపెనీలో 100 శాతం వాటాను ఐదు కంపెనీలు కొనుగోలు చేశాయి. Sparrow investments, GW sky, HILL brooks investments, PARADIGME INNVOVATIONS, Quantela INC , Falcon investments (Singapore). మళ్లీ ఇందులో Sparrow investments అనే సంస్థలో 100 శాతం వాటాలను gate way fund -2 అనే కంపెని చేతుల్లోకి వెళ్లాయి. ఆ కంపెనీ మూలాలు ఎక్కడ అన్నది గమనిస్తే… పన్ను ఎగవేతలకు, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా పేరుగాంచిన Caymans island అనే దీవిలో ఉన్నాయి. ఐదింటిలో మరో కంపెనీ అయిన HILL brooks investments మూలాలు కూడా పన్ను ఎగవేత, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా భావించే బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న వారిలో ఎవరూ ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాదు. అలాంటి వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రైతుల భూముల వివరాలు పెట్టారు. తెలంగాణ రెవెన్యూ శాఖ, భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నెపంతో ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఇతర దేశాల్లో ఆర్ధిక నేరాల్లో ఇరుక్కుపోయిన సంస్థలకు అప్పగించి.. రైతుల సంపూర్ణ డేటాను వాళ్ల చేతుల్లో పెట్టారు. ఇది ఎంత తీవ్రమైన నేరమో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలకు ద్రోహం చేసి, మోసం చేసి సంపూర్ణ సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారంటే.. దీనిపై ఎలాంటి విచారణ చేయాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. జూబ్లీహిల్స్‌లోని ఎంసిఆర్ హెచ్ఆర్డీలో అద్భుతమైన సాంకేతికత పరిజ్ఞానం ఉంది.. ఇతర రాష్ట్రాలకు మన సాంకేతికతను అందిస్తున్న పరిస్థితుల్లో వీళ్లు విదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు’ అని సీఎం విమర్శించారు.

‘కేసీఆర్ ఆవేశంతో ఊగిపోతుంటే ఆనాడు నాకు అర్ధం కాలేదు. ధరణిలో ఎన్నో ఎకరాల భూదాన్ భూములు, ప్రయివేట్ భూముల యజమానుల పేర్లు మారాయి. అగ్రిమెంట్ లోని 9.20 క్లాజ్ ప్రకారం యజమాని పేరు మార్చడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 9.20.4 క్లాజ్ లో పేర్కొన్నట్లు ప్రభుత్వ ఆఫీసులో ఉండి పనులు చేయాలి. రెవెన్యూ శాఖకు సంబంధించిన సీసీఎల్ఏ కార్యాలయం నుంచి పని చేయాలి. తెలంగాణలో కాకుండా విజయవాడలో, బెంగుళూరుకు, ఈశాన్య రాష్ట్రాల నుంచి ధరణిని నిర్వహించారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేని కంపెనీలకు, విదేశీయులకు అప్పగించి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారు. దీనిపై ఎంత కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉందో ఆలోచన చేయాలి. గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ఆ వ్యక్తికి లేదా యజమానికి తెలియకుండా ఎవరికీ ఇవ్వొద్దని చట్టాలు చెబుతున్నాయి. కానీ కేసీఆర్, కేటీఆర్ లు ఇతర దేశాల వ్యక్తులకు ఈ సమాచారం అప్పగించారు. ఇంత ఎంత తీవ్రమైన నేరం?’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు చాలా సమావేశాలు నిర్వహించి భూ భారతి 2024 బిల్లును సభ ముందుకు తీసుకొచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ధరణిలో పగలు జరగాల్సిన రిజిస్ట్రేషన్ లు అర్ధరాత్రి కూడా జరిగాయన్న ముఖ్యమంత్రి… అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ లు చేసే వ్యవస్థ ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? అని ప్రశ్నించారు. ‘బండారం బయటపడుతుందనే ఇవాళ చర్చ జరగకుండా ప్రయత్నాలు చేశారు. ఆనాడు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా … లెక్కచేయకుండా రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం తిమ్మాపూర్ లో భూదాన్ భూములను ప్రయివేట్ వ్యక్తుల పేరుకు మార్చారు. తమ ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదు చేశామన్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను బదిలీ చేశారు. ఎక్కడి నుంచైనా , ఏ పేరుకైనా మార్చేలా స్వైర విహారంచేసే అధికారం సంస్థకు అప్పగించారు’ అని తెలిపారు. ధరణి అద్భుతమైతే సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా ఆయన బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. ‘80వేల పుస్తకాల జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి కేసీఆర్ సంపూర్ణంగా వివరించచ్చు కదా. ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగొద్దని తొండి చేయాలని ప్రయత్నించి వెళ్లిపోయారు’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు చెందిన ప్రతినిధి అపాయింట్ మెంట్ అడిగితే నేనే ఇచ్చా.. వారు చెప్పాకే వ్యవహారం ఏంటనేది అధికారులతో తెలుసుకున్నానని రేవంత్ రెడ్డి సభ్యులకు వివరించారు. ఏసీబీ విచారణ చేస్తున్న సమయంలో, కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో విచారణాధికారులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అడ్వాంటేజ్ తీసుకుంటారని దీనిపై ఎక్కువ మాట్లాడటంలేదన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 వరకు జరిగిన అన్ని వివరాలను ప్రజలకు అందిస్తామన్నారు. ఈ కార్ రేస్ పై ఏడాదిగా చర్చ జరుగుతున్నా… అసెంబ్లీలో నాలుగు సమావేశాల్లో ఎప్పుడైనా దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా?. నిన్నటి నుంచి రేసుపై చర్చ జరగాల్సిందే అని బీఆర్ఎస్ పట్టుబడుతున్నారు.. ఎందుకీ అహంకారం…?. ఏడాదిగా అవసరంలేని చర్చ ధరణి గురించి చర్చ వచ్చిప్పుడే ఈ రేసు గురించి ఎందుకు?. కుట్రపూరిత ఆలోచనతోనే చర్చ జరగకూడదని ప్రయత్నించారన్నారు. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఎప్పుడు పిలిచినా ఇక్కడైన, ఎక్కడైనా.. చివరకు వాళ్ల పార్టీ ఆఫీసులోనైన చర్చకు సిద్దం. రూ.55 కోట్లు చిన్న మొత్తమా? మేం ఒప్పుకోకపోవడం వల్లే ప్రభుత్వం రూ.600 కోట్లు నష్టపోకుండా ఆపగలిగామన్నారు. కేటీఆర్ బావమర్ధి రాజేంద్రప్రసాద్ పాకాల డ్రగ్స్ తో పట్టుబడితే ఇంట్లో పార్టీ చేసుకోవద్దా? అని దబాయిస్తున్నారు.. మనం ఏ సాంప్రదాయంలో ఉన్నామన్నారు. పార్టీ చేసుకుంటే చిచ్చుబుడ్లతో, సారా బుడ్లతో చేసుకోవచ్చు కాని కొకైన్ తో చేసుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకున్న, హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దు అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనే తీరుగా బీఆర్ఎస్ ప్రవర్తన ఉంది… దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం సహించదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మీరు కూడా కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చినట్టుంది స్పీకర్ జి.ప్రసాద్ కుమార్ ను కోరారు. నిన్నటి సభలో ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణ కోరిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు, సిట్ విచారణకు ఆదేశించిన తరువాత అభినందించిన ఆయన, ఈ రోజు వ్యతిరేకిస్తుండడం సిగ్గుచేటన్నారు. ఇవాళ సభలో హరీశ్ రావు పరిస్థితి మాకు అర్ధమైంది… చొక్కాలు చించుకోకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మేనమామ కేసీఆర్ దగ్గర కొరడా దెబ్బలు తప్పవని గలాటా చేశారన్నారు. ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాలి… మరీ మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదన్నారు. పేదల భూ హక్కులను కాపాడేందుకే భూ భారతి-2024 చట్టాన్ని తీసుకువస్తున్నామన్నారు.

అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు భూ భారతి 2024 బిల్లును సభలో ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావలని భావించామన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించింది. సహనం కోల్పోయేలా రెచ్చగొట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా మీరు ఆ అవకాశం వారికి ఇవ్వలేదని స్పీకర్ కు తెలిపారు. ఓపిక నశించి వాళ్లే వెళ్లిపోయినా చర్చకు అవకాశం కల్పించిన మీకు అభినందనలు. రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ లాంటి వారు పోరాటాలు చేసింది భూమి కోసమే కదా అని వివరించారు. ఈ భూమిని ఆత్మగౌరవంగా, హక్కుగా భావించారు. భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారు. అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని చేలాయించాలని చూసినా భూమిని కాపాడుకోవడంలో వారు విజయం సాధించారు. ఆ తరువాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా.. భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుకు కూడా కొంతమంది భూమిపై ఆధిపత్యం చాలాయించడమే కారణమన్నారు. యజమాని హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇందిరా గాంధీ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. నిజమైన భూ యజమాని హక్కులను కాపాడాలని, లేకపోతే చదువులేని వారి భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా చట్టాలు సవరించాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడే ముందు బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల శాసనసభా పక్షం నాయకులు కొన్ని సూచనలు చేయగా, వాటిని పరిశీలించి పరిగణనలోకి తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.