CM Revanth Reddy Secretariat Absence Debate | రెండేళ్ల కాంగ్రెస్ సర్కార్.. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం.. శాఖలపై పట్టులేని మంత్రులు!

గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు బకాయిలు కోసం గొడవలు, ఆందోళనలు చేస్తున్నారు. ఎన్ని వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి? ప్రాధాన్య క్రమంలో ఎవరెవరికి ఇవ్వాలి? అనే దానిపై ఇప్పటి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదని సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో పైరవీలు చేసుకునే వారికే డబ్బులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు బలంగా.. బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖను ఇప్పటి వరకు గాడిలో పెట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భూ సమస్యల ఫైళ్లు లక్షల కొద్దీ పెండింగ్ లో ఉన్నాయి.

CM Revanth Reddy Secretariat Absence Debate | రెండేళ్ల కాంగ్రెస్ సర్కార్.. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం.. శాఖలపై పట్టులేని మంత్రులు!

హైదరాబాద్, అక్టోబర్‌ 18 (విధాత ప్రతినిధి):

CM Revanth Reddy Secretariat Absence Debate | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్‌గా సచివాలయానికి రారని, ఇంటి నుంచో లేదా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచో శాఖలపై సమీక్షలు నిర్వహిస్తారనే వాదన ఉంది. సమీక్షలు లేనట్లయితే అయితే జిల్లా పర్యటనలు లేదంటే ఢిల్లీ వెళ్తారు. మంత్రి మండలి సమావేశాలు నిర్వహించినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చి వెళ్తారు. మంత్రులు ఏమాత్రం వీలున్నా తప్పకుండా సచివాలయానికి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ లేనట్లయితే తమ నియోజకవర్గాలు, జిల్లా కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. రాష్ట్ర సచివాలయానికి పెద్ద దిక్కు ముఖ్యమంత్రి. ఆయన నిత్యం సచివాలయానికి డుమ్మా కొడుతుంటే.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు బాధ్యతగా ఉంటారని భావించడం భ్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికీ చాలా మంది ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు మంత్రులను ఖాతర్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై వచ్చే ఎమ్మెల్యేలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. సందర్శకుల నుంచి దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు అంగీకరించకుండా సమావేశాలంటూ వెళ్లిపోతున్నారని, తామే సుప్రీం అనే విధంగా కొందరు ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. వీరిది ఇలా ఉంటే కింది స్థాయి అధికారులు కూడా తోక జాడిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల వినతులు, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించడంలో తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సచివాలయానికి రావడం లేదు.. మేమెందుకు పనిచేయాలి? అనే విధంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సచివాలయంలో పని చేస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామని అనుకుంటున్నారనే సెటైర్లు వినబడుతున్నాయి.

కేసీఆర్‌ ఆనవాయితీ.. కొనసాగిస్తున్న రేవంత్‌ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో ఉన్నట్లయితే కనీసం రెండు మూడు గంటలు అయినా సచివాలయంలో గడిపేవారు. సమీక్షలు నిర్వహించేవారు, సందర్శకులకు అప్పాయింట్ మెంట్లు ఇచ్చేవారు. దీంతో సచివాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండేవారు. ఎప్పుడు ప్రధాన కార్యదర్శి పిలుస్తారో, ముఖ్యమంత్రి ఏ ఫైలు అడుగుతారోనన్న భయం, అప్రమత్తత ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. దానికి కారణం గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అదే ఆనవాయితీ కొనసాగుతున్నదని ఆయన తన అనుభవంతో చెప్పారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్‌గా సచివాలయానికి వచ్చి, సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజా ప్రతినిధులు, సందర్శకులను కలుస్తూ ఉంటే ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పనిచేస్తున్నారా లేదా అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. అసలు మంత్రులకు తమ శాఖలపై పట్టుందా? లేక పైపైన పనిచేస్తున్నారా అనేది కూడా స్పష్టమవుతుంది. కొందరు కార్యదర్శులు స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సందర్శకుల సమయం మూడు నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉండడంతో, ఆ సమయంలో మెజారిటీ కార్యదర్శులు సమీక్షలు లేదా ప్రధాన కార్యదర్శి సమీక్షలకు హాజరు పేరుతో తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో వచ్చే సందర్శకులు కార్యదర్శులను కలువలేక తిరిగి వెళ్లిపోతున్నారు. కొందరైతే తమకు ఇష్టమైన పనులను మాత్రమే సమీక్షిస్తూ, మిగతా వాటి జోలికి వెళ్లడం లేదనే విమర్శలూ ఉన్నాయి. రెండేళ్ల నుంచి అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవడం లేదు. నెలవారీగా ఎన్ని ఫైళ్లు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, ఎందుకు తిరస్కరించారనే దానిపై సమాచారం లేదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

పరిష్కారం నోచని సమస్యలెన్నో..

గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు బకాయిలు కోసం గొడవలు, ఆందోళనలు చేస్తున్నారు. ఎన్ని వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి? ప్రాధాన్య క్రమంలో ఎవరెవరికి ఇవ్వాలి? అనే దానిపై ఇప్పటి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదని సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో పైరవీలు చేసుకునే వారికే డబ్బులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు బలంగా.. బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖను ఇప్పటి వరకు గాడిలో పెట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భూ సమస్యల ఫైళ్లు లక్షల కొద్దీ పెండింగ్ లో ఉన్నాయి. మండల కార్యాలయాలు, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల్లో అవి మూలుగుతున్నాయి. భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. అవినీతి అధికారుల మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వాపోయారు. తహశీల్దార్ వారం రోజులు, ఆర్డీఓ మూడు రోజులు, అదనపు కలెక్టర్ 3 రోజులు, జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో ఫైళ్లను పరిష్కరించాలని గడువు ఉన్నా అమలు కావడం లేదని ఆయన చెప్పారు. ఇటీవలి వరకు యూరియా కొరతపై రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కారు. సుమారు రెండు నెలల పాటు రైతుల అరిగోస పడ్డారు. వందలాది మంది రైతులు క్యూ లో నిల్చున్నారు. ఈ ఘటన తో కాంగ్రెస్ ప్రభుత్వం బద్నాం అయ్యింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ సంచాలకుల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత అనే ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్య రెట్టింపు అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రించే పని బదులు ‘బాదుడు’కే ఎక్కువ సమయం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చెట్టు వెనకాల, ఫుట్‌పాత్‌లపై నిలబడి.. వచ్చిపోయే వాహనాల ఫొటోలు తీయడానికే పరిమితం అవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గుంతల రోడ్ల కారణంగా ప్రతిరోజు వందలాది మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా జీహెచ్ఎంసీ గుంతలను పూడ్చడం లేదు. రవాణా శాఖ లో ఆన్ లైన్ సేవలు అతీగతీ లేకుండా పోయాయి. ఆఫ్‌లైన్‌లోనే డబ్బులు గుంజి పనులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ శాఖలో ఏం జరుగుతున్నదనే విషయం ముఖ్యమంత్రికి గానీ మంత్రులకు కాని స్పష్టత లేదనేది అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సూక్ష్మ స్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తే ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల పనితీరు బట్టబయలు అవుతుందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.