REVENATH REDDY । తెలంగాణలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవులు వీరికే : సంకేతాలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
నరేంద్ర మోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యత చేపట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచనని పేర్కొన్నారు. రాహుల్ ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు.

REVENATH REDDY । పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు గెలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన పీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నదని అయన చెప్పారు. ప్రభుత్వం కార్యక్రమాలను పార్టీ నాయకత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందుకే వారికి పదవులు ఇచ్చామని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
నరేంద్ర మోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యత చేపట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచనని పేర్కొన్నారు. రాహుల్ ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి, ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు.
దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నాడని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నాలుగోసారి గెలవడం కోసమే జమిలీ ఎన్నికలు తీసుకువస్తున్నారని విమర్శించారు. జమిలి ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా తాను సెలవు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లో 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రైతు రుణ విముక్తి కావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇంచార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు జిల్లాల్లో పర్యటించాలని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు.