Revanth Reddy : వర్షాల వేళ ..ధాన్యం సేకరణపై దృష్టి పెట్టండి

వర్షాల సమయంలో ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Revanth Reddy : వర్షాల వేళ ..ధాన్యం సేకరణపై దృష్టి పెట్టండి

విధాత, హైదరాబాద్ : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో గురువారం సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని సూచించారు. ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్స్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ధాన్యంకొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతీరోజు కలెక్టర్ కు రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వేళ ప్రతీ ఒక్కరు ఫీల్డ్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీంతో ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఇది వరి కోతల కాలం కావడంతో అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందన్నారు.

మానిటరింగ్ సెంటర్లతో పర్యవేక్షించాలి

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానీటర్ చేయాలన్నారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని తెలిపారు. అన్ని విభాగాల అధికార యంత్రాంగం సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని..ప్రజల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని, ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా

తుపాన్ ప్రభావిత వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేపు ఏరియల్ సర్వే నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈనాటి వరంగల్ పర్యటనను శుక్రవారానికి వాయిదా వేసుకున్నట్లుగా వెల్లడించారు. వరంగల్ లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని, అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధింత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలుపాలని స్పష్టం చేశారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డీజీపీ శివధర్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.