Revanth Reddy Visits Warangal : వరంగల్ వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్

వరంగల్ వరద ముంపు ప్రాంతాలు సందర్శించిన సీఎం రేవంత్, బాధితులను పరామర్శించి శాశ్వత నివారణ చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Revanth Reddy Visits Warangal : వరంగల్ వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్, హనుమకొండ ప్రాంతాలలోని వరద ముంపు ప్రాంతాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సందర్శించారు. సమ్మయ్యనగర్, రంగంపేట, పోతన నగర్ ప్రాంతాలలోని వరద బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకొని వారికి ఆర్థిక, భౌతిక సహాయం అందించేందుకు ప్రభుత్వ అండగా ఉంటుదని సీఎం రేవంత్ ధైర్యం కల్పించారు. తర్వాత హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో వరంగల్ నగరం ముంపు పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరంగల్ వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన శాశ్వత చర్యలు, వరద ప్రభావం తదితర అంశాల పై ఈ సమావేశంలో చర్చించారు. వరంగల్ వరద ముంపు నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

ముందుగా ఏరియల్ సర్వే

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించారు. అనంతరం శుక్రవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల హెలిప్యాడ్ కు చేరుకున్నారు. సీఎం వెంట రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లకు రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్న్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి మంత్రులకు స్వాగతం పలికిన వారిలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్ ద్వారా వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.