Indiramma Sarees | మహిళా మంత్రులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి : సీఎం రేవంత్
ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం, అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు.
హైదరాబాద్, నవంబర్ 19(విధాత): ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం, అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు. మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం, మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నామన్నారు. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి, మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని తెలిపారు.
దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు, బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ అని కొనియాడారు. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధీదన్నారు.
ఇందిరమ్మ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది, మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించామన్నారు. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశాం, మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం, రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram