ఆఫ్‌లైన్‌లో పరీక్షల నిర్వహణతో సమస్యలు : సీఎం రేవంత్‌ రెడ్డి

ఆఫ్‌లైన్ పరీక్షల్లో పేపర్ లీక్‌లపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రాకు మద్దతు తెలుపుతూ, తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపును కేంద్రాన్ని కోరారు.

ఆఫ్ లైన్ పరీక్షల నిర్వహణలో సమస్యలు వస్తున్నాయని, పేపర్‌ లీక్‌లకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన అభివృద్ది ప్రాజెక్టులు, నిధుల సాధనకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖలో రాష్ట్ర పరిధి అధికారాలను కేంద్రం లాక్కునే ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం చలాయించాలని కేంద్రం యత్నిస్తోందని అన్నారు. విద్య వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో ఉంటే తప్పిదాలు జరగకుండా ఉంటాయి అని, కేంద్ర చట్టాల మేరకు రాష్ట్రంలో ప్రక్షాళనపై యోచిస్తాం అని తెలిపారు.

హైడ్రాను సమర్థించిన సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా కమిషనర్ కు వ్యతిరేంగా తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై మీడియా ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఓ అధికారిని ఎక్కడ నియమించాలన్న అంశం ప్రభుత్వ పరిధిలోని అంశం అని వ్యాఖ్యానించారు. హైడ్రా ఎన్నో మంచి పనులు చేసిందని, విలువైన ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై చర్యలు తీసుకుని పరిరక్షించిందని హైడ్రాను సమర్థించారు. హైడ్రాపై తప్పుడు ప్రచారం తగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సోమేశ్ కుమార్ మీద 400 కోట్లు దిక్కరణ కేసులు ఉన్నాయని, హైడ్రాపై మాకు స్పష్టత ఉందన్నారు. కబ్జాదారులు కోర్టును తప్పుదారి పట్టించారు అని, కబ్జాలు చేస్తే బడా బాబులైన పేదలైన ఊరుకోబోమని, కబ్జాకోరులే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని, బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నాయకులే కబ్జా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

హైడ్రా పేదలు, పెద్దల పట్ల ఒకేరకంగా స్పందిస్తుందని, ఎన్ కన్వేన్షన్ ఆక్రమణ, ముఖీమ్ ఆక్రమణలు, బతుకమ్మ కుంట, గండిపేట చెరువు ఆక్రమణలను చేసింది పేదలా పెద్దలా మీరు ఆలోచించాలని మీడియాకు సూచించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తునే..హైడ్రాను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటాం అని రేవంత్ స్పష్టం చేశారు. హైడ్రా చర్యలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అయ్యాయని తెలిపారు. హైడ్రాకు వ్యతిరేకంగా దాఖలైన కోర్టు కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు కబ్జాలు కాకుండా చూస్తాం అన్నారు. హైడ్రాను కొనసాగించి తీరుతామని రేవంత్ తేల్చి చెప్పారు.

రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలి..

కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక గ్రామీణాభివృద్ధి అంశాలు, ఉపాధి హామీ పథకంలో కొత్త పనుల చేరిక, నివాస గృహాల నిర్మాణాలకు సంబంధించిన వివరాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో ప్రధానంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) 2.0 కింద తెలంగాణ రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, కాబట్టి ఈసారి రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వివరించారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వీబీ-జీ రామ్-జీ (VB-G RAM-G) జాబితాలో చేర్చి, లబ్ధిదారులకు 90 రోజుల పాటు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా ఎల్‌నినో ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీబీ-జీ రామ్-జీ పథకంలో అదనపు పనులను చేర్చాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణం వంటి 10 రకాల కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. వీటితో పాటు రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ భూముల పునరుద్ధరణ పనులకు కూడా ఉపాధి హామీ కింద అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రేవంత్ రెడ్డి కోరారు.

Latest News