తెలంగాణలో కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలి!

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆహ్వానం మేరకు తేదీ 16.11.2024 నాడు ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మరియు కమిషన్ సభ్యులతో టి పి టి ఎఫ్ రాష్ట్ర కమిటీ విద్యారంగంలో తీసుకరావల్సిన మార్పుల గురించి చర్చించడం జరిగింది.

తెలంగాణలో కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలి!
  • తెలంగాణ విద్యా కమిషన్ తో ముఖాముఖీ కార్యక్రమంలో టీపీటీఎఫ్

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆహ్వానం మేరకు తేదీ 16.11.2024 నాడు ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మరియు కమిషన్ సభ్యులతో టి పి టి ఎఫ్ రాష్ట్ర కమిటీ విద్యారంగంలో తీసుకరావల్సిన మార్పుల గురించి చర్చించడం జరిగింది. విద్యా విధానంపై కొన్ని ప్రతిపాదనలు చేస్తూ
ఒక రిపోర్టును కమిషన్కు అందించడం జరిగింది. ఈ సమావేశంలో టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో ఉందని, మినిస్టర్ పిల్లలైనా, అటెండర్ పిల్లలైనా, కలెక్టర్ పిల్లలైనా, కార్మికుల పిల్లలైనా ఒకే పాఠశాలలో  చదువుకునే కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నంగా ఉన్న  నూతన జాతీయ విద్యా విధానంను  రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, పాఠశాల కరికులంలో  శాస్త్రీయ విద్యా విధానానికి అనుగుణంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక  రంగాలలో జరిగిన అభివృద్ధిని పాఠ్యాంశాలలో  చేర్చాలని  కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ను, తరగతికి ఒక గది మరియు ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల పోస్ట్ ను మంజూరు చేయాలని కోరారు.

పూర్వ ప్రాథమిక తరగతులను  ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం  చేస్తూ పూర్వ ప్రాథమిక విద్య పై శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్ను నియమించాలని,  పాఠశాలలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించకూడదని, ఆన్లైన్ క్లరికల్ వర్క్ లేకుండా చేయాలని కోరారు. మండల,జిల్లా,జోనల్  స్థాయిలో రెగ్యులర్  పద్ధతిలో  వెంటనే  పర్యవేక్షణాధికారులైన  డిఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఒ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలని కోరారు. అకాడమిక్ క్యాలెండర్ అమలయ్యేలా చూస్తూ క్యాలెండర్ కు భిన్నంగా వివిధ జిల్లాలలో తీసుకు వస్తున్న అదనపు కార్యక్రమాలను  లేకుండా చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాల భారం తగ్గిస్తూ మార్పులు చేయాలని కోరడం జరిగింది.నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం నెల నెలా చెల్లించాలని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం స్నాక్స్ ఏర్పాటు చేయాలని కోరారు. చివరగా ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యారంగంలో కీలక భాగస్వాములైన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి సిఫారసులు ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.