కాంగ్రెస్ 1000 రోజుల పాలన క్రిమినల్ వేస్ట్: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన క్రిమినల్ వేస్ట్ అని..దేశంలోనే అన్ని రంగాల్లో విఫలమైన ఏకైక ప్రభుత్వం ఇదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అబద్ధం, అజ్ఞానం, అరాచకం, అవినీతి అనే నాలుగు తలల విషసర్పపు పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన అని మండిపడ్డారు. రేవంత్ 1000రోజుల పాలన ప్రజా పాలన కాదు..ప్రజా పీడన పాలన అని, ప్రజలకు పట్టిన వెయ్యి రోజుల శని అని కేటీఆర్ దుయ్యబట్టారు.

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన క్రిమినల్ వేస్ట్ అని..దేశంలోనే అన్ని రంగాల్లో విఫలమైన ఏకైక ప్రభుత్వం ఇదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అబద్ధం, అజ్ఞానం, అరాచకం, అవినీతి అనే నాలుగు తలల విషసర్పపు పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన అని మండిపడ్డారు. రేవంత్ 1000రోజుల పాలన ప్రజా పాలన కాదు..ప్రజా పీడన పాలన అని, ప్రజలకు పట్టిన వెయ్యి రోజుల శని అని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ ను మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా, తలసాని ప్రభృతులతో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం.. కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టో అని, 420 హామీలు ఇచ్చారని, 13డిక్లరేషన్లు చేశారని, 6 గ్యారంటీలు ఇచ్చారని..వాటిని 100రోజుల్లో అమలు చేస్తామని చెప్పి..1000రోజులైన అమలు చేయకుండా ప్రజలను మోసగించారని విమర్శించారు. కాంగ్రెస్ 100రోజుల పాలన అన్ని రంగాల్లో అట్టర్ ప్లాప్..ఇది 1000రోజుల సర్వభ్రష్ట ప్రభుత్వం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ వెయ్యి రోజుల్లో ఆర్ధిక విధ్వంసం సామాజిక సంక్షోభం, సాంస్కృతిక విద్రోహం మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇదే జరిగింది అని మండిపడ్డారు. గ్యారంటీ కార్డు బాకీ కార్డుగా మారిపోగా..అభయ హస్తం రిక్త హస్తంగా మారిందని విమర్శించారు.

తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా

ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదన కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని, పదవుల కోసం ఢిల్లీలో సిల్లీగా మోకరిల్లుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీకి మూటలు.. ఇక్కడ మంత్రివర్గంలో తన్నులు, కీచులాటలు నిత్యకృత్యం అయిపోగా..రేవంత్ పాలన అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్ అని అభివర్ణించారు. ప్రభుత్వ భూముల స్వాహ పర్వం కొనసాగిస్తున్నారన్నారు.22ఏ తో భూముల దందా చేస్తున్నారని, కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా 33శాతం కమిషన్ల సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల కుంభమేళా కొనసాగుతుందన్నారు. భూకుంభకోణం నుంచి బొగ్గు కుంభకోణం వరకు దోపిడి, అవినీతి అనకొండ పాలన ఇది అని, హైడ్రాను హైకోర్టు తొమ్మిది తలల విషసర్పం అని అభివర్ణించిందని, సీఎంకు హిట్లర్ ఆదర్శం అని చెప్పారని విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యుల దోపిడికి, రైతుల పాలిట రాక్షస పాలన కు వెయ్యి రోజుల పాలన నిదర్శనం అన్నారు. ఫీజు రీయంబర్మెంట్ రూ.10వేల కోట్ల బకాయిలు పెట్టగా..పాలిటెక్నిక్ విద్యార్ధులను రోడ్డున పడేశారని విమర్శించారు. కాంగ్రెస్ లో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ కాదు…ఉన్నది ఒకటే లుచ్చా కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు. మంత్రులే ఒకరి దోపిడిని మరోకరు బయట పెట్టుకుంటారని గుర్తు చేశారు.

చంద్రబాబు చెంచా రేవంత్

అసెంబ్లీకి రావాలని లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ కుక సీఎ రేవంత్ సవాల్‌ చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రమే వచ్చిందని, ఆ రాష్ట్రంలోనే నువ్వు సీఎం పదవి వెలగబెడుతున్నావని, కేసీఆర్ రాజీనామ చేస్తే నీకు తట్టుకునే శక్తి లేదని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి బేసిన్లు, సబ్జెక్ట్ తెలియదు.. బూతులు తప్ప ఏం రావు, దీనికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలా? అని ప్రశ్నించారు. గురుదక్షిణ కోసం గోదావరి, కృష్ణా జలాలను ఏపీకి ధారపోస్తున్న చంద్రబాబు చెంచా రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. 1000 రోజుల్లో 1000 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకోవడమే కాంగ్రెస్ పాలన విజయం అని ఎద్దేవా చేశారు. తన కుర్చీని కాపాడుకోవడం కోసం..
1000 రోజుల దగా పాలనలో 77వ సారి ఢిల్లీ బాసులకు మూటలు మోసుకెళ్లిన బానిస రేవంత్ అని, అన్ని సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి 77పైసలు కూడా తేలేదన్నారు.

బీఆర్ఎస్ ఆందోళనలు

ఈ 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసింది అని, కేసీఆర్ కట్టిన నిర్మాణాలకు రిబ్బన్ కట్టింగ్ తప్ప.. కొత్తగా చేసిందేమీ లేదు అన్నారు. ఇంత అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క చెక్‌డ్యాం కట్టలేదు అన్నారు. మెట్రో విస్తరణ అటకెక్కిందని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ఫోక్సో నిందితులను కాపాడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ సెక్రటేరియట్ లో వేలాది మంది ఉద్యోగులు బయటకు వచ్చి.. హామీలు నిలబెట్టుకుంటావా? చస్తావా? అని బెదిరించే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రైజింగ్ కేవలం క్రైమ్ రేట్ రైజింగ్ లో కనిపిస్తుందన్నారు.

కాంగ్రెస్ 1,000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి మ్రోగిస్తుందని, ​ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ​నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు వారం రోజుల పాటు ‘ధోకేబాజ్‌ కాంగ్రెస్‌’ పేరిట ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నామని తెలిపారు. 1000రోజులు అయిపోయిందని, ఇంకా 820రోజులు మాత్రమే ఉందని..అధికారులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించకతప్పదన్నారు.

 

Latest News