నల్లొండలో కాంగ్రెస్, బీఆర్ఎస్ టఫ్ ఫైట్

  • Publish Date - October 17, 2023 / 10:25 AM IST
  • కంచర్ల వర్సెస్ కోమటిరెడ్డి
  • నువ్వా నేనా అంటూ ప్రచారాస్త్రాలు
  • నామమాత్రంగా బీజేపీ
  • ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో పిల్లి
  • గత ఎన్నికలో గులాబీకే మెజార్టీ స్థానాలు
  • హస్తం పార్టీ అట్టర్ ప్లాప్


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అసెంబ్లీ ఎన్నికలకు నువ్వా నేనా అన్నట్లుగా నల్గొండ రాజకీయ నేతలు సిద్ధమయ్యారు. అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. సిటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంటోంది. నామినేషన్లకు ముందే ప్రచారాస్త్రాలు సంధిస్తూ సై అంటున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో చతికలపడింది.


గత ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో అట్టర్ ప్లాప్ అయ్యింది. తాజా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతనూ ప్రజల్లోకి బలంగా తీసుకెళుతూ, కాంగ్రెస్ జోరు పెంచింది. ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసి, చరిత్రను తిరగరాస్తామని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రధానంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.


తారస్థాయికి మాటల యుద్ధం


ప్రస్తుతం నల్గొండ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై విజయం సాధించాలని తనదైన శైలిలో ప్రచారం ప్రారంభించారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ప్రచారాస్ర్తంగా కంచర్ల జనంలోకి పోతున్నారు. మంత్రిగా పనిచేసినప్పటికీ కనీసం రోడ్లు కూడా బాగు చేయలేని దుస్థితిలో నియోజకవర్గం ఉండేదని ధ్వజమెత్తుతున్నారు.


బీఆరెస్ అధికారంలోకి వచ్చాక వేల కోట్ల రూపాయలను తెచ్చి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు భూపాల్ రెడ్డి ప్రచార సభల్లో చెప్పుకొస్తున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేస్థాయిలో అధికార పార్టీకి కౌంటర్లు విసురుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందని, దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని, భూ దందాలు, ఆక్రమణలకు చెక్ పెడతామని హామీలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిరంకుశ పాలనను అంతమొందిస్తానని చెప్తున్నారు. 2018లో అధికారంలోకి వచ్చేందుకు కంచర్ల భూపాల్ రెడ్డి జండుబామ్ కంట్లో పెట్టుకుని దొంగ ఏడుపులు ఏడిస్తే, ప్రజలు నమ్మి ఓటేశారని.. ప్రస్తుతం వాటికి కాలం చెల్లిందని కోమటిరెడ్డి తప్పికొడుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు మాటలు యుద్ధంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.


బీజేపీలో తేలని అభ్యర్థి


అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ ఇంకా వేచిచూసే ధోరణిలో ఉంది. నల్గొండ నియోజకవర్గంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మాధగాని శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఆశించారు. అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి, ఇంటింటికి తిరుగుతూ మోడీ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రచారం చేస్తూ గ్రామాల్లో కలియ తిరుగుతున్నారు.


బీసీ వాదంతో ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే పార్టీలోనే మరో నేత నాగం వర్షిత్ రెడ్డి కొన్నినెలలుగా విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేపడుతూ, తాను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ భరోసా ప్రజా యాత్రను నాగం ప్రారంభించారు. అధిష్టానం వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తుందో తేలాల్సి ఉంది. ఐతే పార్టీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలంగా లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.


పోటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి


నల్గొండ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ లో కౌన్సిలర్ గా, పట్టణ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన పిల్లి రామరాజు ఎమ్మెల్యేతో విభేదించారు. ఇదే సమయంలో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ వెంటనే అనుచరులు, ఆత్మీయులను కలుపుకుని సమ్మేళనాలు నిర్వహించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు.


ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించి, గడప గడపకూ వెళ్లి ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలతో అభ్యర్థులు ప్రచారాలతో ఓటర్ల వద్దకు వెళుతున్నారు. ప్రజల్లో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా, స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదరిస్తారా? ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పిస్తారా? వేచి చూడాల్సిందే.