కాంగ్రెస్‌-లెఫ్ట్‌ మధ్య పొత్తు ముసలం!

కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంల మధ్య నెలకొన్న పొత్తుల ప్రక్రియ ఆ పార్టీల్లో ముసలం రేపుతోంది.

కాంగ్రెస్‌-లెఫ్ట్‌ మధ్య పొత్తు ముసలం!

విధాత : కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంల మధ్య నెలకొన్న పొత్తుల ప్రక్రియ ఆ పార్టీల్లో ముసలం రేపుతోంది. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులున్న స్థానాలనే సీపీఐ, సీపీఎంలు కోరడంతో ఆ స్థానాల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకత్వంపై ఫైర్ అవుతున్నారు. పొత్తుల్లో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు భద్రాచలం, వైరా స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలను అయిష్టంగానైనా వామపక్షాలు అంగీకరించినట్లుగా సమాచారం. అయితే మిర్యాలగూడ సీటును సీపీఎంకు వదిలేస్తే కాంగ్రెస్ నేత బత్తిని లక్ష్మారెడ్డి తిరుగుబాటు చేసే పరిస్థితి కనిపిస్తున్నది.

వైరా, చెన్నూరులోనూ కాంగ్రెస్ టికెట్ ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు సీపీఐలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తన కొత్తగూడం సీటు కోసం మనుగోడును వదిలేశారంటూ నల్లగొండ జిల్లా సీపీఐ నాయకులు మండిపడుతున్నారు. పార్టీకి బలమున్న మునుగోడును కాదని కూనంనేని తన స్వలాభం చూసుకున్నారని పార్టీ నేత నెల్లికంటి సత్యం వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగానైనా పోటీ చేయాలని నెల్లికంటిపై ఒత్తిడి పెంచుతున్నారు.