సూర్యాపేటలో విద్వేషాలు రగిలిస్తున్న కాంగ్రెస్

సూర్యాపేటలో జగదీష్ రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం ప్రజాస్వామ్యానికి ముప్పు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు.

సూర్యాపేటలో విద్వేషాలు రగిలిస్తున్న కాంగ్రెస్

విధాత : సూర్యాపేట నియోజకవర్గంలో గత పదేళ్లపాటు వివిధ రాజకీయ పక్షాలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో తమ కార్యకలాపాలు కొనసాగించాయని..స్వార్థ రాజకీయాలతో నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజలు..పార్టీల మధ్య విద్వేషాలు రగిలిస్తుందని సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం విమర్శించారు. బుధవారం సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి గుంపుగా వచ్చిన కాంగ్రెస్ అల్లరి మూకలు భయానక వాతావరణాన్ని సృష్టించడాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మూకలు చేసిన దౌర్జన్యం 2014 పూర్వపు అరాచక పరిస్థితులు తిరిగి రాబోతున్నాయన్న సంకేతాన్ని ఇస్తోందని విమర్శించారు.

నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం..ఆయన అధికారిక నివాసం కూడా అని..అక్కడ ఎవరి ఫోటోలు ఉండాలి, ఉండకూడదో నిర్ణయించే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికే ఉందన్నారు. దీనిని పక్కనబెట్టి అర్థంలేని వాదనలతో హద్దులు మీరి ప్రవర్తించడం వారి అహంకారానికి పరాకాష్ట అని బిక్షం ఆక్షేపించారు.

విజ్ఞులైన సూర్యాపేట ప్రజలు గత మూడు పర్యాయాలు అభివృద్ధి, శాంతియుత వాతావరణం కోసం గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ఎన్నుకున్నారని.. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సూర్యాపేట నియోజకవర్గం మాత్రమే కాక ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పథంలో నడిచిందని భిక్షం గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ప్రతిక్షణం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జగదీష్ రెడ్డి పోరాటం చేస్తున్నారని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.

యూరియా అందని రైతులు, ఉద్యోగాలు దక్కని నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల్లోకాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిని నెలకొందని..దానిని దాచిపెట్టడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తుందని భిక్షం ఆరోపించారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలను సూర్యాపేట ప్రజలు గమనిస్తున్నారని.. ఇటువంటి దౌర్జన్యాలను, అరాచక శక్తులను సమయానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.