కాంగ్రెస్‌.. ‘దస్‌’ కా దమ్‌?

మరో 40 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్‌తోపాటు

కాంగ్రెస్‌.. ‘దస్‌’ కా దమ్‌?
  • ఒకట్రెండు సీట్లలోనే బీఆరెస్‌ గెలుపు?
  • రెండు మూడు స్థానాల్లోనే బీజేపీ!
  • కాంగ్రెస్‌ను బలోపేతం చేసిన వలసలు
  • అభ్యర్థుల ప్రకటనలో జాప్యం ప్రభావం!
  • ఇంకా రిపేర్లు పూర్తి చేసుకోని కారు
  • హైప్‌ క్రియేట్‌ చేసే యత్నాల్లో బీజేపీ

విధాత ప్రత్యేకం: మరో 40 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్‌తోపాటు.. బీజేపీ సైతం ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అధికార పార్టీగా ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను చేజిక్కించుకుంటామన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ ఉన్నది. మరోవైపు బీఆరెస్‌ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు ఉంటున్నప్పటికీ.. పార్టీ అధినేత జనం మధ్యకు రావడంతో ఆ గులాబీ శ్రేణుల్లో కాస్తంత ఉత్సాహం కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న కారు.. ఇంకా పూర్తి స్థాయిలో రిపేర్లు పూర్తిచేసుకోకుండా లోక్‌సభ ఎన్నికలకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. దీనికి తోడు ఆ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతుండటం కూడా కలవరానికి గురిచేస్తున్నది.

కొన్ని ప్రాంతాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా బలంగా లేని బీజేపీ సైతం ఏదో జరిపోతుందన్న భ్రమలు కల్పిస్తూ, మోదీ చరిష్మాతో అన్ని చోట్ల తమదే గెలుపని చెప్పుకొంటూ హైప్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నది. అదే సమయంలో రాజకీయ చదరంగంపై ఎక్కువ దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలు ఎదుర్కొంటున్న అతి కీలకమైన సాగు, తాగునీటి సమస్యను సకాలంలో పరిష్కరించడంలో విఫలమైందన్న అభిప్రాయాలు సైతం వినిపిస్తుండటం గమనార్హం. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఏర్పడిన కరువును అధిగమించే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు అంటున్నారు. ఇది ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా కనిపిస్తున్నది. బీఆరెస్‌ నేతలు ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని చెబుతున్నా.. కరువు సంకేతాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఉన్నాయి. తాము మిషన్‌ భగీరథ ద్వారా అన్నిగ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించామని బీఆరెస్‌ నేతలు చెబుతున్నా.. వాస్తవానికి అనేక గ్రామాలకు పైప్‌లైన్‌లు లింక్‌ కాలేదు. దీంతో చాలా గ్రామాల‌కు సుర‌క్షిత‌ తాగునీరు అంద‌డం లేదు. మరోవైపు రిజర్వాయర్లలో తాగునీటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. స‌రైన య‌జ‌మాన్య పద్ధతులు అవలంబించకపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా దృష్టి సారించి కొద్దిపాటి నిధులు విడుద‌ల చేసి, గ్రామాల‌కు నీళ్లు వ‌చ్చేలా చేస్తే చాల‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వెలువ‌డుతోంది. దీనిని కాంగ్రెస్‌ ఎలా పరిష్కరిస్తుందనే అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి ప‌దేళ్లు అధికారంలో ఉన్న బీఆరెస్ తన ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చే ఎత్తుగడలను అనుసరించింది. 2014లో గెలిచిన త‌రువాత రాష్ట్రంలో బ‌ల‌మైన పార్టీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకొని టీడీఎల్‌పీనే విలీనం చేసుకున్న‌ది. ఇదే తీరుగా 2018లో గెలిచిన త‌రువాత మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకొని సీఎల్‌పీని విలీనం చేసుకున్న‌ది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు ఏ మాత్రం ప్ర‌త్యామ్నాయం కాద‌ని బీఆరెస్ బ‌హాటంగానే ప్ర‌క‌టించింది. కానీ 2023 ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అయి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. తదుపరి మూడు నెల‌ల్లోనే రాజ‌కీయ ప‌రిణామాలు పూర్తిగా తారుమార‌య్యాయి. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు పెరిగి పోయాయి. రాజ‌కీయ కురువృద్ధుడు కే కేశవరావు బీఆరెస్‌ సెక్రటరీ జనరల్‌ పదవికి రాజీనామా చేసి.. తన కుమార్తె, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. బీఆరెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నిలిచారు. చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, వ‌రంగ‌ల్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న కావ్య, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్ త‌దిత‌రులు బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా అనేక మంది నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు కాంగ్రెస్‌లో చేర‌డానికి క్యూ క‌డుతున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. శ‌నివారం తుక్కుగూడ‌లో జ‌రిగే కాంగ్రెస్ స‌భ‌లో దాదాపు 12 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేర‌తార‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది. ఇదే జ‌రిగితే కాంగ్రెస్‌కు గట్టి ఊపు వచ్చే అవకాశం ఉంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత బీఆరెస్ డీలా ప‌డ‌టంతో కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డింది. బీఆరెస్ స్థానాన్ని బీజేపీ ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేసినా స‌ఫ‌లం కాలేద‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం 2018 ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్‌కు ఎలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డిందో ప్ర‌స్తుతం బీఆరెస్‌కు అలాంటి ప‌రిస్థితే ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటువంటి రాజకీయ పరిస్థితుల మధ్య తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉన్నది? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి? అన్న అంశాలే ఏ నలుగురు కలిసినా చర్చలో ఉంటున్నాయి. సాధార‌ణ ఓట‌రు ఏవైపు ఆలోచిస్తున్నారు? ఆయా నాయ‌కుల సానుకూల అంశాలు, ప్ర‌తికూల అంశాలు ఏమిటో తెలుసుకోవ‌డానికి విధాత క్షేత్రస్థాయి ప‌రిశీల‌న చేసింది. ప‌లువురు విశ్లేష‌కుల‌తో చ‌ర్చించింది. సాధారణ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నది.

తెలంగాణ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభ‌జించి ప‌రిశీలిస్తే ద‌క్షిణ తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవ‌కాశాలున్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గాలవారీగా చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా ఉత్త‌ర తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌ర్సెస్‌, బీఆరెస్‌, బీజేపీల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర త్రిముఖ పోటీ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక్క‌డ మూడు పార్టీలు సీట్ల‌ను పంచుకునే అవ‌కాశాలున్నాయని చెబుతున్నారు. ప్ర‌ధానంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని నాలుగు పార్ల‌మెంటు స్థానాల‌ను పరిశీలిస్తే మూడు స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ గెలుపు కోసం హోరా హోరీగా పోరాటం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అర్బన్‌, సెబీ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గాలైన సికింద్రాబాద్‌, మ‌ల్కాజిగిరి, చేవెళ్లలో బీఆరెస్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన లీడ‌ర్ల‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వ‌డం ప‌ట్ల ఒకింత అనాస‌క్త‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సొంత పార్టీ నాయ‌కులు లేరా? బ‌య‌ట నుంచి తెచ్చుకొని పోటీ చేయించ‌డం అవ‌స‌ర‌మా? అన్న ప్రశ్నలు కాంగ్రెస్‌ శ్రేణుల నుంచే ఎదురవుతున్నాయి. పైగా అర్బన్ ఓట్ బ్యాంక్ చివ‌రి నిమిషంలో ఎటువైపు ట‌ర్న్ తీసుకుంటుందో కూడా చెప్ప‌డం క‌ష్ట‌మ‌న్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బీఆరెస్ అత్య‌ధికంగా అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న గ్రేట‌ర్‌లోనే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మూడ‌వ స్థానానికి ప‌రిమితం అయ్యేట‌ట్లు ఉంద‌న్న చ‌ర్చ కూడా ఉన్నది. హైద‌రాబాద్ మిన‌హా మిగిలిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య నువ్వా.. నేనా అన్న‌ట్లుగా పోటీ ఉంద‌ని అంటున్నారు. పైగా ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది బీఆరెస్ నేత‌లు కాంగ్రెస్‌లో చేర‌డం కాంగ్రెస్‌కు క‌లిసి వ‌చ్చే అంశంగా చెబుతున్నారు. అలాగే వ‌రంగ‌ల్ పార్ల‌మెంటుకు బీఆరెస్ త‌న పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన క‌డియం కావ్య.. త‌న తండ్రితో క‌లిసి కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డం బీఆరెస్‌కు కోలుకోలేని దెబ్బ‌గా రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికలో జాప్యం, కొన్ని సీట్లలో అభ్యర్థుల ఎంపిక వంటి వ్యవహారాలు ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బయట ప్రచారం జరుగుతున్నట్టుగా.. కాంగ్రెస్ పార్టీ శనివారం తుక్కుగూడ‌లో నిర్వ‌హించే స‌భ‌లో.. బీఆరెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే కారు పార్టీ ఒక‌టి, రెండు స్థానాల‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బీజేపీ ఎంత చేసినా, ప్ర‌ధాని మోదీని ఎన్నిసార్లు తెలంగాణ‌కు తీసుకు వ‌చ్చినా రెండు మూడు స్థానాల‌కంటే అధికంగా గెలిచే అవ‌కాశం లేద‌ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.