వరంగల్లో కాంగ్రెస్ పట్టు….బీఆరెస్ ఫట్
విప్లవోద్యమాల ఖిల్లా, తెలంగాణ ఉద్యమానికి పోరుగడ్డగా నిలిచిన ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమతమ నియోజకవర్గాల్లో పట్టు నిలబెట్టుకుని ముగ్గురు పార్టీ ఎంపీ అభ్యర్ధుల విజయంలో కీలక భూమిక పోషించారు. తె

భారీ మెజారిటీతో రెండు ఎంపీలు కైవసం
పట్టునిలబెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు
ఒక్క తూర్పు సెగ్మెంటులో బీజేపీకి మెజారిటీ
అంతటా రెండవ స్థానానికి చేరుకున్న బీజేపీ
మూడవ స్థానానికి పరిమితమైన బీఆరెస్
విధాత ప్రత్యేక ప్రతినిధి:
విప్లవోద్యమాల ఖిల్లా, తెలంగాణ ఉద్యమానికి పోరుగడ్డగా నిలిచిన ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమతమ నియోజకవర్గాల్లో పట్టు నిలబెట్టుకుని ముగ్గురు పార్టీ ఎంపీ అభ్యర్ధుల విజయంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమపార్టీగా జిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్న బీఆరెస్ తన వైభవాన్ని కోల్పోయి మానుకోట ఎంపీ పరిధిలో రెండవ స్థానానికి, వరంగల్ ఎంపీ పరిధిలో మూడవ స్థానానికి చేరుకున్నది. అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్క వరంగల్ తూర్పు మినహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన 11 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ సాధించారు. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతిపక్ష బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం సైతం భువనగిరి ఎంపీ పరిధిలో ఉంటుంది. మిగిలిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు వరంగల్ లోక్ సభ పరిధిలో, మిగిలిన నాలుగు నియోజకవర్గాలు మహబూబాబాద్ లోక్ సభ పరిధిలో ఉంటాయి. ప్రస్తుతం 12 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ బీఆరెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
11 స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేని జనగామ సెగ్మెంటులో సైతం మంచి మెజారిటీ సాధించి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డి విజయానికి దోహదం చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధికి 32వేలకు పైగా మెజారిటీ లభించింది. కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డికి 76,032 ఓట్లు, బీజేపీకి 44,787 ఓట్లు, బీఆరెస్ కు 43,844 ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంటు ఎన్నికల్లో పట్టు నిలుపుకున్నది. ఒక్క వరంగల్ తూర్పులో మాత్రం 7వేల ఓట్ల మెజారిటీ బీజేపీ సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానానికి పరిమితమైంది. ఈ నియోజకవర్గానికి మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 67,066 ఓట్లు రాగా, బీజేపీకి 74,142 ఓట్లు, బీఆరెస్ కు 20, 360 ఓట్లు లభించాయి, ఇదిలా ఉండగా మిగిలిన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తమ పట్టును నిలుపుకున్నారు.
నర్సంపేట ఫస్ట్ ప్లేస్
మానుకోట ఎంపీ పరిధిలోని నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పోరిక బలరామ్ నాయక్ కు 55111 ఓట్ల మెజారిటీ లభించింది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి లక్షా339 ఓట్లు రాగా బీఆరెస్ కు 45,228 ఓట్లు లభించాయి.
రెండవ స్థానంలో ములుగు
మానుకోట ఎంపీ పరిధిలోని ములుగు సెగ్మెంట్లో కాంగ్రెస్ కు 53,233 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గంలో మంత్రి ధనసరి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 86,825 ఓట్లు రాగా, ప్రత్యర్ధి బీఆరెస్ కు 33,592 ఓట్లు లభించాయి.
మూడవ స్థానంలో మానుకోట
మానుకోట ఎంపీ పరిధిలోని మహబూబాబాద్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 49,883 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ కు లక్షా211ఓట్లు రాగా, బీఆరెస్ కు 52.128 ఓట్లు లభించాయి.
డోర్నకల్ లో 45వేల మెజారిటీ
మానుకోట ఎంపీ పరిధిలోని డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 45013 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ కు లభించింది. ఇక్కడ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ కు 95,306 ఓట్లు రాగా, బీఆరెస్ కు 50,293 ఓట్లు వచ్చాయి.
పాలకుర్తిలో 44వేల మెజారిటీ
వరంగల్ ఎంపీ పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ 44,767 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక్కడ యశస్వినిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంవహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 80,256 ఓట్లు పొందగా, బీజేపీకి 35,489 ఓట్లు, బీఆరెస్ కు 47,878 ఓట్లు లభించాయి.
భూపాలపల్లిలో 32వేల మెజారిటీ
వరంగల్ ఎంపీ పరిధిలోని భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీకి 32,164 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక్కడ గండ్ర సత్యనారాయణరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 85,629 ఓట్లు, బీజేపీకి 53,465 ఓట్లు, బీఆరెస్ కు 31,360 ఓట్లు లభించాయి.
వర్ధన్నపేటలో 31వేల మెజారిటీ
వర్ధన్నపేటలో కాంగ్రెస్ కు 31వేల మెజారిటీ లభించింది. ఇక్కడ కేఆర్ నాగరాజు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 91,779 ఓట్లు రాగా, బీజేపీకి 59,886 ఓట్లు, బీఆరెస్ కు 31,345 ఓట్లు లభించాయి. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి రమేష్ గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు.
పరకాలలో 22వేల మెజారిటీ
పరకాలలో 22వేల మెజారిటీ కాంగ్రెస్ సాధించింది. ఇక్కడ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 73,378 ఓట్లు, బీజేపీకి 50477 ఓట్లు, బీఆరెస్ కు 36,477 ఓట్లు లభించాయి.
స్టేషన్ పై కడియం పట్టు
స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్యకు 63075 ఓట్లు లభించాయి. బీజేపీకి 45,152 ఓట్లు, బీఆరెస్ కు 41,357 ఓట్లు లభించాయి. స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యేగా కడియం -శ్రీ హరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడియం బీఆరెస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు. శ్రీహరి కుమార్తె కావ్య ఎంపీగా పోటీచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఎమ్మెల్యేగా శ్రీహరికి 101696 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కు 93,917 ఓట్లు, బీజేపీకి కేవలం 4,984 ఓట్లు మాత్రమే లభించాయి. 7,779 ఓట్ల మెజారిటీతో కడియం గెలుపొందారు. ప్రస్తుతం 17,923 ఓట్ల మెజారిటీ సాధించారు. అనూహ్యంగా బీజేపీకి కూడా ఓట్లు భారీగా పెరిగాయి. ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కొంత ప్రభావం కనబరిచింది.
వరంగల్ పశ్చిమలో 7వేల మెజారిటీ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 7,167 ఓట్ల మెజారిటీ సాధించింది. ఈ నియోజకవర్గంలో నాయిని రాజేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 65,584 ఓట్లు, బీజేపీకి 58,417 ఓట్లు, బీఆరెస్ కు 19680 ఓట్లు లభించాయి.
మూడవ స్థానానికి బీఆరెస్ పరిమితం
వరంగల్ ఎంపీ పరిధిలో అనూహ్యంగా బీఆరెస్ మూడవ స్థానానికి పరిమితమైంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం మూడవ స్థానంలో నిలిచింది. ఒక్క పాలకుర్తి సెగ్మెంటులో మాత్రం రెండవ స్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీ మూడవ స్థానానికి పరిమితమైంది. 2014 నుంచి వరంగల్ ఎంపీ స్థానం బీఆరెస్ వరుసగా కైవసం చేసుకుంటోంది. సిట్టింగ్ స్థానంలో బీఆరెస్ మూడవ స్థానానికి పరిమితమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన బీఆరెస్ ఇప్పుడు మూడవ స్థానానికి నెట్టివేయబడింది. వరంగల్ తూర్పు, పశ్చిమలో ఆ పార్టీ ఓట్లు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా మానుకోట ఎంపీ పరిధిలో బీఆరెస్ రెండవ స్థానంలో ఉంది. కాంగ్రెస్, బీఆరెస్ మధ్య పోటీ జరిగింది.