Congress | హైదరాబాద్‌కు పొన్నం అనుచరులు.. పార్టీ పెద్దల వద్దకు పంచాయతీ

Congress విధాత బ్యూరో, కరీంనగర్: ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కు చోటు దక్కకపోవడం పట్ల ఆయన అనుచరులు భగ్గుమంటున్నారు. తెలంగాణ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో తమ నేతకు ప్రాధాన్యత దక్కకుండా చేయడం పట్ల వారు మండిపడుతున్నారు. NSUI సాధారణ కార్యకర్త స్థాయి నుంచి లోక్సభ సభ్యుని వరకు ఎదిగిన ప్రభాకర్ మూడు దశాబ్దాలకు పైగా పార్టీకి చేస్తున్న సేవలను అధినాయకత్వం గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయమై పార్టీ నాయకత్వంతో […]

Congress | హైదరాబాద్‌కు పొన్నం అనుచరులు.. పార్టీ పెద్దల వద్దకు పంచాయతీ

Congress

విధాత బ్యూరో, కరీంనగర్: ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కు చోటు దక్కకపోవడం పట్ల ఆయన అనుచరులు భగ్గుమంటున్నారు. తెలంగాణ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో తమ నేతకు ప్రాధాన్యత దక్కకుండా చేయడం పట్ల వారు మండిపడుతున్నారు. NSUI సాధారణ కార్యకర్త స్థాయి నుంచి లోక్సభ సభ్యుని వరకు ఎదిగిన ప్రభాకర్ మూడు దశాబ్దాలకు పైగా పార్టీకి చేస్తున్న సేవలను అధినాయకత్వం గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయమై పార్టీ నాయకత్వంతో చర్చించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ మద్దతుదారులు ఆదివారం హైదరాబాద్ బయలుదేరారు.

ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో ఉమ్మడి జిల్లాకే చెందిన MLA శ్రీధర్ బాబు, MLC తాటిపర్తి జీవన్ రెడ్డిలకు చోటు దక్కిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు అంశం ఎన్నికల కమిటీ చేతిలోనే ఉంటుంది. దీంతో అభ్యర్థుల ఎంపికలో తమ నేతకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే ఆందోళన పొన్నం వర్గంలో వ్యక్తమౌతుంది. SRR కళాశాల విద్యార్థి సంఘం నేతగా, యువజన కాంగ్రెస్ నేతగా, కాంగ్రెస్ నేతగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించకపోవడం శోచనీయమని పొన్నం వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత కల్పించాల్సింది పోయి, కీలక కమిటీ కూర్పులో ఆయనను విస్మరించడం సరికాదని పొన్నం వర్గం అంటోంది.

PCC ఎన్నికల కమిటీలో పొన్నంకు సముచిత ప్రాధాన్యత దక్కకపోతే తాము పార్టీకి రాజీనామాలు చేయాల్సి ఉంటుందని ఆయన వర్గం చెబుతుంది. అయితే PCC ఎన్నికల ప్రణాళికల కమిటీలో పొన్నంకు చోటు కల్పిస్తామని పార్టీ నాయకత్వం చెబుతున్నట్టు సమాచారం.