Shabbir Ali | ఫిరాయింపులకు ఆధ్యులే వారు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సవాల్‌

తెలంగాణలో ఫిరాయింపుల సంస్కృతికి తొలుత పాల్పడిందే కేసీఆర్‌, కేటీఆర్ అని, నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సవాల్ చేశారు

Shabbir Ali | ఫిరాయింపులకు ఆధ్యులే వారు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సవాల్‌

కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఫిరాయింపుల సంస్కృతికి తొలుత పాల్పడిందే కేసీఆర్‌, కేటీఆర్ అని, నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సవాల్ చేశారు. శుక్రవారం కురియన్ కమిటీ ముందు షబ్బీర్ అలీ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల తేడాను కురియన్ కమిటీ అడిగిందని షబ్బీర్ అలీ తెలిపారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి గల కారణాలను అడిగారని చెప్పారు. నిజమాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్‌కు 17 వేల మెజార్టీ వచ్చిందని చెప్పానన్నారు. కామారెడ్డిలో పార్లమెంట్, అసెంబ్లీలో మెజార్టీ చెప్పానని వివరించారు.
ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల నుంచి బీఆరెస్‌ ఏజెంట్లు బయటికి వెళ్లి పోయారని, బీఆరెస్ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేశారని కమిటీకి వివరించడం జరిగిందన్నారు. బాన్సు వాడలో అసెంబ్లీలో బీఆరెస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి 27వేల ఓట్ల ఆధిక్యత వస్తే, పార్లమెంట్‌లో 18 వేల మైనస్ ఓట్లు పడ్డాయని వివరించానన్నారు.

మాజీ మంత్రి కేటీఆర్ కంటే నేను సీనియర్ లీడర్‌నని, నేను ఛాలెంజ్ చేస్తున్నానని, తెలంగాణలో ముందు ఫిరాయింపులకు పాల్పడింది ఎవ్వరని ప్రశ్నించారు . తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని రాజీనామా చేయించకుండా మంత్రిని కేటీఆర్ చేశారని, 46 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా బీఆరెస్‌ చేర్చుకున్నారని, 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురిని చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్సీలను చేర్చుకున్నారని, అవన్ని వాస్తవం కాదని రుజువు చేస్తే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. లేదంటే కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని నేను కేటీఆర్‌కు ట్వీట్ చేశానని తెలిపారు. దీంతో నా ట్విట్టర్ (X) అకౌంట్‌ని కేటీఆర్‌ బ్లాక్ చేసిండని తెలిపారు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అంగట్లో కొన్నట్లు కొనుగోలు చేసి వారి పార్టీలోకి చేర్చుకుని, ఇప్పుడు అభివృద్ధి కోసం మా పార్టీ లోకి వస్తున్నవారిపై విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. మేము బీఆరెస్‌ను కూలగొడతామని, త్వరలో అందరూ కాంగ్రెస్‌లోకి వస్తారని షబ్బీర్ అలీ తెలిపారు.