శాసనసభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు..? సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
శాసనసభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు..? అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు

హైదరాబాద్ : శాసనసభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు..? అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మీలో ఎవరైనా ఒకరు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించొచ్చు కదా అని మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సభలో ప్రతిపక్ష నాయకుడు లేడు. పదేండ్ల పాలన కేసీఆర్ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. ఈ నష్టాల ఊబిలోకి విద్యుత్ సంస్థలు ఎందుకు నెట్టేయబడ్డాయని చర్చించుకుంటున్నాం. ఈ సమయంలో కేసీఆర్ లేకపోవడం సరికాదు. మీ నాయకుడు రాలేదు అంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు.. మేమే చాలు అని అంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఎంపీ, అధికారుల మాట విన్నారా..? నో అపాయింట్‌మెంట్.. ఒంటెద్దు పోకడ.. ఉన్నది ఉన్నట్టు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు.. అంత దమ్ము, ధైర్యం వీళ్లకు లేదు.. ఆయన వినేవాడు కాదు. అంత పెద్ద మనిషి సభకు రాకుండా, చర్చలో పాల్గొనకుండా ఉన్నాడు. సభకే రానప్పుడు, ఆయన అవసరం లేనప్పుడు ఆ పోజిషనల్‌లో ఆయన ఎందుకు..? మీలోనే ఒకరు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించండి అని రాజగోపాల్ రెడ్డి సూచించారు.
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అందుకే రైతులు మమ్మల్ని గెలిపించారు. పదేండ్లు ప్రజలు అవకాశం ఇస్తే పలు తప్పులు చేశారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వండి. కరెంట్ లేకుండా పది నిమిషాలు కూడా ఉండలేం. ఈ హౌస్ కూడా ఐదు నిమిషాలు నడవలేదు. అలువంటి కరెంట్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని చెబితే ప్రష్టేషన్‌కు గురికాకండి. బయట ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు చేసిన తప్పులను సవరించి, నష్టాల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చి వినియోగదారులందరికీ తక్కువ ధరతో కరెంట్ ఇవ్వాలని నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి.. మేం తప్పు చేస్తే చెప్పండి.. కచ్చితంగా సవరించుకుంటాం. సభలో కానీ బయట కానీ హుందాగా వ్యవహరించండి అని ఆయన కోరారు.
ప్రతిపక్ష నాయకులు సీఎం మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొన్నిమంచి పనులు చేశారు. ప్రధానమైన విద్యుత్, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా బతుకులు మారలేదు అని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు ప్రజలు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సభను వాడుకోవద్దు. ఆచరణకు, అమలుకు సాధ్యం కానీ మాటలు చెప్పలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పారు అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.