మంత్రివర్గం నుంచి కొండాను బర్తరఫ్ చేయాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా..కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించని మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ హై కమాండ్ ను కోరారు. ఈ మేరకు సీఎల్పీలో తీర్మానం చేస్తామని..తీర్మానాన్ని ఏఐసీసీ, పీసీసీకి ఇవ్వనున్నట్లుగా వారు తెలిపారు. 15మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5 గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం వేశారు. పార్టీ లైన్ ధాటిన వారిపైన, ప్రతిపక్షాలకు కుట్రలలో పావులుగా మారుతూ..పార్టీకి నష్టం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ సహా ఎంతటి నాయకులైనా సరే..వాదందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండా కుటుంబంతో పాటు సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు.

సీఎల్పీ మీడియా భేటీలో ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, నాయినీ రాజేందర్, ఎడ్మ బొజ్జు, వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రిగా కొండా సురేఖ ఖండించలేదని వారు తప్పుబట్టారు. సీఎంను సుస్మిత ఏకవచనంతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కూతురు వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి ఆమెను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోనికి రావడానికి రేవంత్ రెడ్డి కృషి ప్రధాన కారణం అని, లక్షల మంది కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటూ కూర్చున్న కొమ్మను నరికేసుకున్నట్లుగా కొండా కుటుంబం వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు.

ప్రతిపక్షాల కుట్రలో పావులుగా వ్యవహరిస్తున్నారు..

సీఎంను, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలని కొందరు చూస్తున్నారని, సీఎంను బలహీనపరచాలని విపక్షాల కుట్రను వారు అమలు చేస్తున్నారని, వారి కుట్రలను, ప్రజలు, కార్యకర్తలు అర్థం చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మొదటి నుంచి కూడా కొండా సురేఖ మాటలు పార్టీకి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని, సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టేవారు పార్టీలో ఉండడానికి అనర్హులు అని వారు పేర్కొన్నారు. కొండా కుటుంబం తీరును చూసి ప్రజలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కొండా కుటుంబం ఒక్క ఎమ్మెల్యేతో కూడా సరిగా లేరన్నారు. ఇంకా ఎన్నాళ్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారంటూ మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు పార్టీకి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. నాలుగు పార్టీలు తిరిగివచ్చిన వారు పార్టీల మార్పు గురించి మాట్లాడటం సరికాదు అని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొండా పార్టీలో లేరన్నారు. సీఎంను విమర్శిస్తూ..ఇంకోవైపు కేబినెట్ లో కొనసాగడం సురేఖకు తగదన్నారు.

ఈ సమావేశంలో.. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మా రెడ్డి, బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యలు ఉన్నారు.

Latest News