Jagga Reddy | కాంగ్రెస్‌లోకి బీఆరెస్ నుంచి 25 మంది: జగ్గారెడ్డి
పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి బీఆరెస్ నుంచి 25మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 5గురు ఎమ్మెల్యేలు చేరబోతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

బీజేపీ నుంచి 5 గురు ఎమ్మెల్యేలు
జూన్ 4తర్వాత వలసలు
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
విధాత : పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి బీఆరెస్ నుంచి 25మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 5గురు ఎమ్మెల్యేలు చేరబోతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 25 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేం స్వాగతిస్తున్నామన్నారు.
అంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కిషన్ రెడ్డి మాటలతో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా కిషన్‌రెడ్డి మారినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అధికార పార్టీలు మంచి చేస్తే మెచ్చుకునే గుణం వాజ్‌పేయ్ లాగే కిషన్ రెడ్డికి వచ్చిందని చలోక్తులు వేశారు. కానీ కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న సంగతి చెప్పలేదని, ఆయన పార్టీ నుంచి కూడా 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని జోస్యం చెప్పారు.
కిషన్‌రెడ్డికి వరి పంటపై సరైన అవగాహాన లేదని, ధాన్యం మద్దతు ధర నిర్ణయించేది కేంద్రం అని కేంద్రమంత్రికి తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ ప్రొఫెసర్ లాంటిదని, బీజేపీ ఎన్నికుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చలేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం బీజేపీకి పోయిందన్నారు. తెలంగాణలో హత్య రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేశారు.