చదివింది ఒకటి.. సర్టిఫికేట్లపై ఇంకోటి.. వెలుగులోకి ఫేక్ కాంట్రాక్టు ఉద్యోగుల భాగోతం
కంచే చేనును మేసింది అనే నానుడి మనం విన్నాం. కానీ ఇక్కడ కంచె, చేను ఒక్కటై దున్నపోతులను మేపుతున్న కహాని జర దేకో.... తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణలో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
విధాత, హైదరాబాద్:
కంచే చేనును మేసింది అనే నానుడి మనం విన్నాం. కానీ ఇక్కడ కంచె, చేను ఒక్కటై దున్నపోతులను మేపుతున్న కహాని జర దేకో…. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణలో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బీహార్ లోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ నుంచి పొందిన సర్టిఫికెట్‌లను పరిశీలిస్తే అవి ఫేక్ సర్టిఫికెట్లు అని తేటతెల్లం అవుతున్నట్లు ఉస్మానియా విద్యార్థి నేత కే.ఎల్లం యాదవ్ వాటికి సంబంధించి వెల్లడించిన వివరాలు వాట్సప్ వేదికగా వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ నకిలీ అభ్యర్థి శ్రీనివాస్.. లీడర్‌గా మారి దాదాపు 30 మంది వరకు ఈ యూనివర్సిటీ కి చెందిన ఆర్కే కాలేజ్ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. 2007 నుండి 2008 సంవత్సరాల మధ్యలో సుమారు 85 నుండి 95 శాతం వరకు పాస్ మార్కుల పర్సంటేజీతో నకిలీ పీజీ సర్టిఫికెట్లు పొంది ఈ బాగోతం నడిపించినట్టు తెలుస్తోంది.
ఇతని ద్వారా నకిలీ ధ్రువపత్రాలు పొందిన అభ్యర్థులు 2008 నుండి 2010 మధ్యలో కామర్స్, ఇంగ్లీష్, బాటని, మ్యాథ్స్ లెక్చరర్లుగా కాంట్రాక్టు ఉద్యోగం పొందినట్లు సమాచారం. క్రమబద్దీకరణ అనంతరం జన్యునిటీల విషయంలో కూడా శ్రీనివాస్ తలా లక్ష రూపాయలు వసూలు చేసి నకిలీ జెన్యూనిటీ ధ్రువపత్రాలు ఇప్పించి చక్రం తిప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరి సర్టిఫికెట్‌లను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటిపై ఉన్న నెంబర్లు ఒకే సిరీస్ గా ఉండి గ్రాఫిక్ మాయాజాలంతో మార్చినట్టుగా తేటతెల్లం అవుతోంది. వీరిలో మచ్చుకు కొందరీ బాగోతం.. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తూ రెగ్యులర్ అయిన శెట్టి కృష్ణ బీహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా ఆర్‌కే కాలేజీ నుండి పొందిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఎంఏ ఇంగ్లీష్ కాగా అతని పేజీ కాన్వకేషన్ పై ఉన్న బార్ కోడ్ మాత్రం ఎం.కామ్ (అకౌంట్స్) గా చూపెడుతోంది. అదే కళాశాలలో సివిక్స్ అధ్యాపకుడిగా రెగ్యులర్ అయిన ఏ.రాజు.. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్లుగా కాన్వకేషన్ ఉంది. కానీ మెమోపై కనబడే బార్ కోడ్ మాత్రం ఎం.కామ్ (అకౌంట్స్)గా చూపిస్తోంది. విచిత్రం ఏమిటంటే వీరు ఇద్దరూ చదివిన అకాడమిక్ ఇయర్స్ వేరువేరు కానీ కాన్వకేషన్లపై చూపెడుతున్న సీరియల్ నెంబర్లు మాత్రం ఒక్కటే. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే జిల్లాకు చెందిన కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా రెగ్యులర్ అయిన పాతూరి శ్రీనివాస్ చదివింది ఎం.ఏ ఇంగ్లీష్. కానీ బార్ కోడ్ మాత్రం ఎం.కామ్ అకౌంటెన్సీగా చూపెడుతుంది. ఇతను అందరికీ నాయకత్వం వహిస్తూ పెద్ద మొత్తంలో మెమోలు సృష్టించిన నాయకుడిగా వ్యవహరించాడని గత కొంతకాలంగా చలామణి అవుతోంది. అలాగే, చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యులర్ అయిన మ్యాథ్స్ లెక్చరర్ పయ్యావుల తిరుపతి ఎంఎస్‌సీ మ్యాథ్స్ చదివినట్లుగా పీజీ మెమో ఉంది. ఇతడి పీజీ కాన్వకేషన్ పై బార్కోడ్ కనబడటం లేదు. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇతను పీజీలో జాయిన్ అయిన రోజే పీజీ పాస్ అయినట్లుగా కాన్వకేషన్ మేమో రావడం విచిత్రం.
ఇదే యూనివర్సిటీలో చదివినట్టుగా జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులను నిర్వహిస్తున్న ఇంగ్లీష్ అధ్యాపకుడు న్యారం బాల మల్లయ్య కు కూడా పీజీలో జాయిన్ అయిన రోజే పాస్ అయినట్లుగా కాన్వకేషన్ సర్టిఫికెట్ ఉంది. అయితే, పయ్యావుల తిరుపతి, న్యారమ్ బాల మల్లయ్యలది కాన్వకేషన్ సీరియల్ నెంబర్ ఒక్కటే ఇక్కడ కొస మెరుపు. చదివింది ఒకే యూనివర్సిటీ, ఒకే కాలేజ్ కానీ, మెమోలపై ఉన్న నెంబర్లు కూడా ఒక్కటే అని సర్టిఫికెట్లపై తేట తెల్లం అవుతుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల మ్యాథ్స్ అధ్యాపకుడు ల్యాగల పరశురాములు కాన్వకేషన్ సీరియల్ నెంబర్, బాల మల్లయ్య కాన్వకేషన్స్ సీరియల్ నెంబర్, పయ్యావుల తిరుపతి కాన్వకేషన్స్ సీరియల్ నెంబర్ ఒక్కటే కావడం విచిత్రంగా కనిపిస్తోంది. పైగా ఈ ముగ్గురికి పీజీలో జాయిన్ అయిన రోజే పీజీలు పూర్తి అయినట్లుగా మెమోల ద్వారా స్ఫష్టంగా కనిపిస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా రెగ్యులరైజేషన్ అయిన రమేష్ బండారి విషయం గమనిస్తే ఇలా ఉంది. ఇతడి సర్టిఫికెట్లపై మొదటిసారి సమాచార హక్కు చట్టం ద్వారా అడగగా బార్ కోడుతో ఉన్న కాన్వకేషన్ సర్టిఫికెట్లను అందించాడు. మళ్లీ రెండవసారి ఆర్టీఐ కింద సర్టిఫికెట్లను అడగగా బార్ కోడ్ లేకుండా కాన్వకేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించాడు. ఇది ఎలా సాధ్యం? అక్కడ ఉన్న ఆర్టీఐ ఆఫీసర్ కి ఇట్లాంటి విషయాలలో సంబంధం లేదా? లేదా అందరూ ఒకటయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా ఒకటి రెండు జిల్లాలనే యూనిట్ గా తీసుకొని పరిశీలిస్తే తప్పుడు ధ్రువపత్రాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. వీరు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే ఇందుగలడు అందు లేడు అన్న నానుడిలా… డిగ్రీ ,ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా రెగ్యులర్ అయిన వారిలో కొందరు ఇదే లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్లు పొంది రెగ్యులర్ అయ్యారు అనే వాదనలకు బలం చేకూరుస్తోంది. పరిస్థితులు ఈ విధంగా ఉంటే పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలలో నకిలీ అభ్యర్థులతో చదువు చెప్పించడం దేనికి సంకేతం? దశాబ్దాల పాటు అధికారులు కళ్లు మూసుకుని ఉండడం సిగ్గుచేటు అని ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉన్నత విద్య, ఇంటర్ విద్యాధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి నకిలీ అభ్యర్థులపై చర్యలు చేపట్టి ప్రజాధనాన్ని దొంగల పాలు కాకుండా కాపాడాలనీ ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు కోరుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram