Two Years Congress Ruling | 23 నెలల కాంగ్రెస్ పాలన.. 2.5 లక్షల కోట్లు అప్పులు! బకాయిదారులకు మొండి చెయ్యే!!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2025 డిసెంబర్ 9 నాటికి రెండేళ్లు నిండనున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో భారీ స్థాయిలో అప్పులు తెస్తున్నా.. బకాయిలు ఎందుకు పెండింగ్‌లోనే ఉంటున్నాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Two Years Congress Ruling | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్ 9వ తేదీ నాటికి రెండేళ్లు నిండబోతున్నది. ఈ రెండేళ్లలో బాగానే అప్పులు తీసుకున్నది. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల కోట్ల అప్పులను బ్యాంకులు, సెక్యురిటీ బాండ్ల ద్వారా సేకరించింది. వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, నిధులు విడుదల అవుతున్నాయి. రాష్ట్రంలో రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగాల నుంచి కూడా పన్నుల రూపేణా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నది. అయినా చిన్న చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని వాళ్లు మొత్తుకుంటున్నారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ మొత్తాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల కొద్దీ జీతాలు చెల్లించకుండా సతాయిస్తున్నారు. సమకూరిన సొమ్ములు ఎక్కడి పోతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సగటున ప్రతి నెలా రూ.10వేల కోట్లు చొప్పున సెక్యూరిటీ బాండ్ల విక్రయం లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నది. ఇటీవల మరో రూ.4వేల కోట్ల సెక్యురిటీ బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులు, గ్యారెంటీలు లేకుండా తెచ్చిన రుణాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ప్రతి నెలా సగటున రూ.10వేల కోట్ల చొప్పున పదిహేను నెలల కాలానికి రూ.1.5 లక్షల కోట్ల రుణం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదనంగా మరో రూ.80వేల కోట్ల అప్పులు తీసుకున్నది. ప్రతి నెలా వ్యయం రూ.22,500 కోట్ల దాకా ఉండగా, ఆదాయంతో పాటు అప్పులు కలిపినా రూ.18వేల కోట్లకు మించడం లేదు. లోటు ఉన్న రూ.4,500 కోట్లు పూడ్చుకునేందుకు ప్రభుత్వ భూములు విక్రయించడం, తనఖా లేకుండా రుణాలు తీసుకుంటున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.54వేల కోట్ల రుణాలు తీసుకుంటామని రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిపాదించింది. కొత్త ప్రాజెక్టుల పేరుతో వ్యయాలు పెరగడంతో ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోకుండా ఉండలేని పరిస్థితి దాపురించింది. మొదటి, రెండో త్రైమాసికంలో అనగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.50వేల కోట్ల అప్పులు తీసుకున్నది. ఇందులో ఏకంగా రూ.16వేల కోట్లు అక్టోబర్ నెలలోనే తీసుకుని రికార్డు నెలకొల్పింది. ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యురిటీ బాండ్ల విక్రయం ద్వారా రూ.54వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. తొలి ఆరు నెలల్లో రూ.50వేల కోట్లు సమీకరించింది. ఇక మిగిలింది రూ.4వేల కోట్లు మాత్రమే. తీసుకుంటున్న అప్పులను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో పేర్కొన్న ప్రకారం కాకుండా మించి రుణాలు సేకరించే పరిస్థితులు ఉన్నాయి. ఇంధన అమ్మకాలు, మద్యం విక్రయ పన్నుల రూపేణా రూ.37,500 రాబడి ఉంటుందని అంచనాలు వేయగా అందులో సగం మాత్రమే వసూలు అయ్యింది. గతేడాది కూడా ఇదే రకంగా ఇంచుమించు రాబడి వచ్చింది. పన్ను యేతర ఆదాయం, కేంద్రం గ్రాంట్లలో కూడా కోత పడడంతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా తయారైంది. ఇందులో ఇప్పటి వరకు పదిహేను శాతం మించి నిధులు రాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పులను ఇబ్బడి ముబ్బడిగా చేస్తోంది.
పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిల గుట్టను తగ్గించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడా బడా కాంట్రాక్టర్లు, కొత్త ప్రాజెక్టులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం మినహా మిగతా చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలు ఉన్నాయి. బడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుని బకాయిలు చెల్లిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలా వసూలు చేసిన కమీషన్లను ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ తమ బకాయిల కోసం రిటైర్డు ఉద్యోగులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు బీఆర్ అంబేద్కర్ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థి సంఘాలు, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నారు. మూసివేస్తామని హెచ్చరించడంతో ఇటీవలే కొద్ది మొత్తాన్ని విడుదల చేసి మమ అనిపించారు.
Read Also |
Viral Video : యువతి సాహసం..నృత్యం చేస్తూనే 554 ఆలయ మెట్ల అధిరోహణం
TPCC Chief Mahesh Kumar Goud : హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితం
Amaravati : అమరావతి రాజధానికి చట్టబద్దత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram