AP, Telangana Salaries Burden | జీతాలు, పెన్షన్లు, వడ్డీలే ముందు! ఆదాయం వచ్చినా రాకున్నా వీటికి సమకూర్చాల్సిందే!

దేనికి ఉన్నా.. దేనికి లేకున్నా ఇబ్బంది లేదు కానీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌లు, రిటైర్‌ అయ్యేవారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తోపాటు.. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు నిర్దిష్ట మొత్తాన్ని సిద్దం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడాయని కాగ్‌ తాజా నివేదికలోని గణాంకాలు పేర్కొంటున్నాయి.

AP, Telangana Salaries Burden | జీతాలు, పెన్షన్లు, వడ్డీలే ముందు! ఆదాయం వచ్చినా రాకున్నా వీటికి సమకూర్చాల్సిందే!

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విధాత ప్రతినిధి):

AP, Telangana Salaries Burden | జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, వడ్డీలు! దేనికి ఖర్చు చేయకపోయినా.. వీటికి మాత్రం ప్రతినెలా తప్పకుండా నిధులు సమకూర్చుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా, రాకపోయినా వీటికి మాత్రం తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా గందరగోళం ఏర్పడి, ప్రభుత్వం పరువు బజారున పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని కాగ్‌ విడుదల చేసిన తాజా నివేదికనుబట్టి తెలుస్తున్నది. ఏపీలో 2013–14 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు రూ.22,980 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, పెన్షన్ల కోసం రూ.13,682 కోట్లు, తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు రూ.12,911 కోట్లు అవసరమయ్యాయి. ప్రతి ఏడాది రూ.49,573 కోట్లు నికరంగా చెల్లించాల్సిన డబ్బులు ఇవి. పదేళ్ళ తరువాత 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలకు రూ.36,583 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, పెన్షన్ల చెల్లింపులకు రూ.22,584 కోట్లు, అప్పులకు వడ్డీల కింద రూ.25,492 కోట్లు చెల్లింపులు చేశారు. మొత్తం రూ.84,659 కోట్లు అన్న మాట. ఏపీలో పన్నుల రాబడులు, సీఎస్ఎస్ నిధులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మొత్తం రూ.1,57,768 కోట్లు కాగా.. ఇందులో నుంచి జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు రూ.84,659 కోట్లు అంటే సగానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

తెలంగాణలోనూ సేమ్‌ సీన్‌

తెలంగాణలో 2014–15 ఆర్థిక సంవత్సరంలో జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, పెన్షన్లు, తీసుకున్న అప్పులకు వడ్డీలకు మొత్తం చెల్లించినది రూ.20,076 కోట్లు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు రూ.10,639 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు, పెన్షన్లకు రూ.4,210 కోట్లు, వడ్డీలకు రూ.5,227 కోట్లు చెల్లింపులు చేశారు. పోలీసు ఉద్యోగ నియామకాలు మినహా ఇతర నియామకాలు లేకున్నా, పీఆర్సీ పెంపు కారణంగా తొమ్మిది సంవత్సరాల తరువాత 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు అదనంగా భారం పెరిగింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, పెన్షన్లు, వడ్డీలకు రూ.63,406 కోట్లు చెల్లించారు. ఇందులో ఉద్యోగుల జీతాలు రూ.25,769 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, పెన్షన్లు రూ.15,816 కోట్లు, వడ్డీలకు రూ.21,821 కోట్లు ఉన్నాయి. 2013–14 లో తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీలు రూ.5,227 కోట్లు అయితే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల కింద చెల్లించినవి రూ.21,821 కోట్లు. తొమ్మిది సంవత్సరాల తరువాత వడ్డీల భారం రూ.16వేల కోట్లు అదనంగా పెరిగింది. ఇదీ వడ్డీ చెల్లింపు లెక్క మాత్రమే. తీసుకున్న రుణానికి అసలు ఎంత చెల్లిస్తున్నారనేది తెలుపలేదు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడం కారణంగా కూడా జీతాల చెల్లింపు వ్యయం అనూహ్యంగా పెరిగింది. తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో రూ.4,210 కోట్ల నుంచి రూ.15,816 కోట్లకు ఎగబాకింది. ఏ రకంగా చూసినా రిటైర్మెంట్ బెన్ఫిట్స్, పెన్షన్లు, వడ్డీల వ్యయం మూడింతలు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో కూడా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, సీఎస్ఎస్ రూపేణా రూ.1,59,350 కోట్లు రాగా ఇందులో నుంచి జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు రూ.63,406 కోట్లు చెల్లించారు.

కర్ణాటకలో స్వల్పం.. రాజస్థాన్‌లో అత్యధిక జీతాలు

దేశంలోని అన్ని రాష్ఠ్రాల లెక్కలు ఒకసారి గమనిస్తే 2012–13 ఆర్థిక సంవత్సరంలో జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెన్ఫిట్స్, వడ్డీలకు రూ.6,26,849 కోట్లు (వార్షిక బడ్జెట్ లో 46.34 శాతం) ఉండగా పది సంవత్సరాల్లో అనగా 2022–23లో రూ.15,63,649 కోట్లకు (వార్షిక బడ్జెట్ లో 43.49%) పెరిగింది. కొన్ని రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాలు శాశ్వత నియామకాలు చేపట్టడం లేదు. 2022–23 సంవత్సరంలో జీతాలకు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రూ.60,061 కోట్లు, తమిళనాడు రూ.63,596 కోట్లు చెల్లించాయి. విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రం కర్ణాటక రూ.17,817 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.21,006 కోట్లు మాత్రమే చెల్లించడం విశేషం. కరువు రాష్ట్రంగా పేరొందిన చిన్న రాష్ట్రం రాజస్థాన్ రూ.59,378 కోట్లు చెల్లించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో రూ.13,533 కోట్లు మాత్రమే జీతాలకు చెల్లిస్తున్నారు.

మౌలిక సదుపాయాల్లో కడు దయనీయం

ఏపీలో 2012–13 లో విద్య, క్రీడలు, సాంస్కృతిక‌ విభాగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.238 కోట్లు ఖర్చు చేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.64 కోట్లకు తగ్గించారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రెండేళ్లు అనగా 2020–21లో రూ.3,417 కోట్లు, 2021–22 లో రూ.3,176 కోట్లు చొప్పున భారీగా నిధులు ఖర్చు చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులకు ఎక్కడ కూడా తగ్గకుండా భారీగా నిధులు కేటాయించి, మంజూరు చేస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు సంబంధించి వ్యయం అంతంత మాత్రంగానే ఉంది. 2012–13 లో రూ.579 కోట్లు మంజూరు చేయగా, అది కాస్తా 2022–23లో రూ.197 కోట్లకు తగ్గింది. జనాభాలో 80 శాతం వరకు ఉన్న ఈ వర్గాలకు చెందిన మౌలిక వసతుల కల్పనకు నిధులు పెరగాల్సింది పోయి తగ్గించారు. అంటే ఈ వర్గాల ఉన్నతి కోసం ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదనేది తేటతెల్లమవుతోంది.

తెలంగాణలో కూడా నీటి పారుదలకే పెద్దపీట

గత తొమ్మిది ఏళ్ళలో తెలంగాణ ప్రభుత్వం కూడా నీటి పారుదల ప్రాజెక్టులకే పెద్దపీట వేసింది. 2013–14 లో రూ.5,194 కోట్లు వ్యయం చేయగా, 2022–23లో రూ.18,916 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి సంవత్సరం కేటాయింపులు పెంచుకుంటూ వచ్చారు. ఈ నిధులతో కొత్త ప్రాజెక్టులను నిర్మాణం చేశారు కాని పెండింగ్ లో ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తి చేసే పనికి పూనుకోలేదు. విద్య, క్రీడలు, సాంస్కృతిక‌ విభాగాల్లో మౌలిక వసతుల కోసం తొమ్మిది సంవత్సరాలలో ఖర్చు బాగానే పెంచారు. రూ.196 కోట్ల నుంచి రూ.585 కోట్లకు పెరిగింది. డబుల్ బెడ్ రూమ్ పథకం పుణ్యమా అని తొమ్మిది సంవత్సరాలలో ఈ శాఖలో రూ.826 కోట్ల నుంచి రూ.3,026 కోట్లకు నిధులు పెంచారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం చేశారు. ఈ నాలుగు వర్గాలకు మౌలిక వసతుల కల్పన కోసం 2013–14 లో రూ.418 కోట్లు వ్యయం చేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.245 కోట్లకు కుదించారు. విదేశీ ఆదాయం సమకూర్చే పర్యాటక రంగంపై పూర్తిగా అశ్రద్ద పెట్టారు. గడచిన ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయకపోవడం శోచనీయం. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.