TELANGANA | గురుకులాలకు కార్పొరేట్ కళ ..సమీక్షించిన సీఎస్ శాంతి కుమారి
కార్పొరేట్ తరహాలో రాష్ట్రంలో అన్ని వసతులు, అధునాత న సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీని కోసం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 31 చోట్ల భూమి గుర్తింపు..
8 పాఠశాలలకు పనులు ప్రారంభం..
మరో పది స్కూళ్ల ఏర్పాటుకు సన్నాహాలు
విధాత, హైదరాబాద్ : కార్పొరేట్ తరహాలో రాష్ట్రంలో అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీని కోసం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 ప్రాంతాల్లో ఈ స్కూళ్లను నిర్మించేందుకు భూమిని గుర్తించారు. ఇందులో 8 ప్రాంతాల్లో పనులు కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో పది చోట్ల వీటి ఏర్పాటు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. భూమిని గుర్తించే పనిలో ఉన్నారిప్పుడు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి ప్రత్యేక గది మొదలైనవి ఉండాలని, ఈ భవనాలన్నింటికీ ఏకరీతి డిజైన్‌ను వారంలోగా సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌కి నోడల్ ఆఫీసర్‌గా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 49 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 31 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా, మిగిలిన 10 పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.