కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ..ఫలితం వెలువడేందుకు సుదీర్ఘ సమయం

రంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మే 27న పోలింగ్ జరుగగా ఓట్ల లెక్కింపు బుధవారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాము వద్ద మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 96 టేబుళ్లపై 96వేల తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ సాగుతోంది.

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ..ఫలితం వెలువడేందుకు సుదీర్ఘ సమయం

విధాత : వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మే 27న పోలింగ్ జరుగగా ఓట్ల లెక్కింపు బుధవారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాము వద్ద మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 96 టేబుళ్లపై 96వేల తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ సాగుతోంది. ఇందులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం నాలుగు రౌండ్స్‌లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మొత్తం 3,36,013 ఓట్లు పోలుకాగా, పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు 2139 పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్ రెడ్డి (బీఆరెస్‌), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) ప్రధానంగా పోటీ పడ్డారు.

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో బీఆరెస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ఉదయం 8గంటల నుంచి బండిల్స్ కట్టడం ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగించారు. 3గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లలో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగవచ్చని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేయాల్సివస్తుందని, అప్పుడు ఫలితం మరింత ఆలస్యం కావచ్చంటున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న, రాకేశ్‌రెడ్డిల మధ్య ఆధిక్యతలు మారుతు వస్తున్నాయి.