CPI Narayana | అమరవీరుల త్యాగాలు.. పోరాటాలతోనే తెలంగాణ: సీపీఐ నారాయణ
ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలు..సకల జనుల పోరాటాలతోనే వల్లే తెలంగాణ వచ్చిందని, ఒక్కరో ఇద్దరో కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

విధాత, హైదరాబాద్: ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలు..సకల జనుల పోరాటాలతోనే వల్లే తెలంగాణ వచ్చిందని, ఒక్కరో ఇద్దరో కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గన్ పార్క్ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని, తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని, తెలంగాణ పేటేట్ రైట్స్ మొత్తం కేసీఆర్‌కు పోయాయని, తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు కేసీఆర్ పాలించారని, సరైన పద్ధతిలో కేసీఆర్ పరిపాలన అందించలేకపోయారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్.. తన కుటుంబ సభ్యులను మాత్రం బాగానే అభివృద్ధి చేసుకున్నారన్నారు.
కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రతి పక్షంలో కూర్చున్నా కూడా కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగలేదన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలలకు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరని గుర్తు చేశారు. ఆ ఆరు నెలలు ఫామ్ హౌస్‌లో పడుకుని కేబినెట్ ఏర్పాటు చేయలేదని, అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశారని, అందుకే ఈసారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. రేవంత్ రెడ్డి ఉత్సాహవంతుడని, కేంద్ర పార్టీ సపోర్ట్ కూడా ఆయనకు ఉందని, గతంలో జరిగిన తప్పులను గుర్తించి తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ పని చేయాలని హితవు పలికారు. అనవసరమైన గిల్లి కజ్జాలు పెట్టుకుంటే టైం వేస్ట్ తప్ప.. ఉపయోగం ఉండదని రేవంత్ గమనించాలన్నారు. అభివృద్ధిలో ఒక్కడివే కాకుండా అందరినీ కలుపుకుని పోవాలని, అందరినీ కలుపుకుని పోతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, అందుకు కమ్యూనిస్టు పార్టీ కూడా సహకరిస్తుందని నారాయణ తెలిపారు.