రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

తెలంగాణ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా ఇంఛార్జ్‌కు ఢిల్లీ పోలీసులు నోటీస‌లు జారీ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫేక్ వీడియోను స‌ర్క్యూలేట్ చేశార‌ని తెలంగాణ కాంగ్రెస్ సోష‌ల్‌ మీడియా ఇన్‌ఛార్జ్ మ‌న్నె స‌తీష్‌కు సీఆర్పీసీ 91 కింద నోటీసులు

రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీస్‌ సమన్లు
మరో నలుగురికి కూడా
మే 1న విచారణకు రావాలని ఆదేశం
మొబైల్‌ఫోన్‌ తీసుకురావాలని సూచన
ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు
మూలకర్తలను గుర్తించే పనిలో అధికారులు
పలు సామాజిక మాధ్యమాలకు లేఖలు
నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్‌
ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ, అమిత్‌షా
ఢిల్లీ పోలీసులనూ వాడుతున్నారని వ్యాఖ్య
తాను ఎవరికీ భయపడబోనని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మరో నలుగురికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సంబంధించిన నకిలీదిగా చెబుతున్న వీడియో కేసులో మే 1వ తేదీన తమ వద్దకు రావాలని సూచించారు. దర్యాప్తు కోసం ఆయన వాడే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను కూడా తీసుకురావాలని సమన్లలో పేర్కొన్నారు. హోం శాఖ పరిధిలోని సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను మొత్తం రిజర్వేషన్లు రద్దు చేయాలన్నట్టుగా ఆ వీడియోలో వక్రీకరించారని ఫిర్యాదులో ఐ4సీ పేర్కొన్నదని సమాచారం. ఐపీసీలోని పలు సెక్షన్లతోపాఉట, చైటీ చట్టం కింద కేసులు నమోదు చేశారని, ఈ విషయంలో దేశవ్యాప్తంగా అరెస్టులు జరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. అంతకు ముందు.. అమిత్‌షాకు చెందిన కల్పిత వీడియోను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నదని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎవరికీ భయపడేది లేదు:రేవంత్‌

తనకు ఢిల్లీ పోలీసులు సమన్లు పంపడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రధాని మోదీ ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్‌ విభాగాలను మాత్రమే మోదీ, అమిత్‌షా ఉపయోగించారు. కానీ.. ఈ రోజు.. ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వచ్చారని నాకు తెలిసింది. ఎవరో సామాజిక మాధ్యమాల్లో ఏదో పోస్ట్‌ చేశారని వాళ్లు తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి వచ్చారు. దానర్థం.. ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు నరేంద్రమోదీ ఢిల్లీ పోలీసులను కూడా వాడుతున్నారు. ఎవరూ భయపడేవాళ్లు లేరు. మీకు తగిన జవాబు చెబుతాం’ అని రేవంత్‌రెడ్డి కర్ణాటకలోని కలబురగిలో నిర్వహించిన ఎన్నికల సభలో అన్నారు.

సామాజిక మాధ్యమాలకు అధికారుల లేఖలు

ఇదిలా ఉంటే.. స్పెషల్‌ సెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ (ఐఎఫ్‌ఎస్‌వో) అధికారులు.. ఈ వీడియో మూలకర్త ఎవరు? ఎవరు దీనిని ప్రచారంలో పెట్టారు? అనే అంశాలు తెలుసుకునేందుకు పలు సామాజిక మాధ్యమ వేదికలను సంప్రదిస్తున్నారని సమాచారం. ఈ అంశంలో దర్యాప్తు జరిపేందుకు, ప్రధాన నిందితులను అరెస్టు చేసేందుకు తాము అనేక బృందాలను ఏర్పాటు చేశామని ఈ వీడియో గురించి ఎక్స్‌, ఇతర సామాజిక మాధ్యమాలకు లేఖలు పంపామని ఒక అధికారి తెలిపారు.