Deputy CM Bhatti | రైతు ప్రయోజనాలకు ‘భరోసా’.. లోపాలు సరిదిద్ది కొత్త విధానం: డిప్యూటీ సీఎం భట్టి

చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలు పరిరక్షించడంలో ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని, వారికి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Deputy CM Bhatti | రైతు ప్రయోజనాలకు ‘భరోసా’.. లోపాలు సరిదిద్ది కొత్త విధానం: డిప్యూటీ సీఎం భట్టి

రైతు సంఘాల ప్రతినిధుల నిరసన

విధాత, వరంగల్ ప్రతినిధి: చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలు పరిరక్షించడంలో ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని, వారికి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే డబ్బుల్లో ఒక పైసా కూడా వృధా పోకుండా అర్హులైన వారికి అందించే లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజాపాలనలో ప్రజలు చెల్లించే ప్రతి పైసాకు జవాబుదారీ తనము ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రైతుల సూచనల మేరకే రైతు భరోసా పథకం అమలుజేస్తామన్నారు. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘo అవసరమైన సూచనలు ప్రభుత్వానికి అందచేస్తుందని స్పష్టం చేశారు. మీరిచ్చే సూచనలన్నింటినీ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన తీరు తెన్నులపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వర్క్ షాప్ ను హన్మకొండ కలెక్టరేట్ లో నిర్వహించారు.

ఈ సందర్బంగా భట్టి మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో సరైన పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించిందని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు, సాగు యోగ్యం కానీ గుట్టలకు రైతు బంధు ఇచ్చిందన్నారు. వాటిని సరిదిద్ది, సక్రమంగా అమలు చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం ముందుగా హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. రెండు లక్షలు రైతు రుణమాఫీ సైతం ఆగస్టు నుంచి అమలు చేస్తామని చెప్పారు.

రైతుల సూచనలను తీసుకొని అసెంబ్లీ సమావేషాల్లో చేర్చించి అందరికి న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిజమైన రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాకుంటే పథకంలో అనర్హులను ఏరువేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, జిల్లా అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పోలీసుల తీరుపై రైతు సంఘాల నిరసన

రైతు భరోసా పథకంపై రైతులు రైతు సంఘాల అభిప్రాయాలు స్వీకరించేందుకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా వర్క్ షాప్ కు పోలీసులు తమను రానివ్వకపోవడం పట్ల కొన్ని రైతు సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘాల పేరుతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు హాజరయ్యారని, నిజమైన రైతు సంఘాలు, రైతు ప్రతినిధులు ఈ సమావేశానికి తక్కువగా హాజరయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తమ అనుకూల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తమకు అవసరమైన అభిప్రాయాలను మాత్రమే స్వీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాత్రానికి సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలంటూ ప్రశ్నించారు. నిరసన తెలిపిన వారిలో రైతు సంఘం ప్రతినిధులు హంసారెడ్డి, గోనె కుమారస్వామి, సావిత్రి, గడ్డం నాగార్జున, ఆల్ ఇండియా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు రాచర్ల బాలరాజు తదితరులు ఉన్నారు.