ప్రారంభమైన ప్రజాపాలన సభలు
మాది ప్రజల ప్రభుత్వం..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..అబ్ధుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలనకు ప్రారంభోత్సవం

విధాత : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, పట్టణాల్లో వార్డు సభలను ప్రారంభించిన అధికారుల బృందాలు ప్రజల నుంచి అభయ హస్తం పథకాల దరఖాస్తులను స్వీకరించడంలో నిమగ్నమయ్యారు. అధికారులతో పాటు పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజాపాలన సభల్లో పాల్గొంటూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అధికారికంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మెట్‌లో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16395ప్రాంతాల్లో ప్రజాపాలన సభలు మొదలవ్వగా అందులో 12,679గ్రామ పంచాయతీల్లో, 3,626మున్సిపల్ వార్డుల్లో 3,714అధికార బృందాలు దరఖాస్తుల స్వీకరణ చేపట్టాయి. ప్రతి వంద మందికి ఒక దరఖాస్తు కౌంటర్ ఏర్పాటు చేశారు. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన వార్డు, గ్రామసభలు కొనసాగనున్నాయి. ఈ సభలలో దరఖాస్తులు అందించలేని వారు తదుపరి మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ దరఖాస్తులు అందించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలన గ్రామసభల్లో మహాలక్ష్మి పథకం 2,500సహాయం కోసం, 200యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తుకు సంబంధించి గృహ జ్యోతి పథకంకు, రైతు భరోసా, యువ వికాసం, చేయూత పింఛన్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మాది ప్రజాప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మాది ప్రజల ప్రభుత్వమని, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికి పథకాలు అందిస్తుందని, మా పార్టీలోకి వస్తేనే పథకాలు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మెట్‌లో ప్రారంభించి మాట్లాడారు. మాది దొరల ప్రభుత్వం కాదని, ఒక వర్గానికి, వ్యక్తికి సంబంధించింది కాదని, ప్రజల చేత, ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని ఈ ప్రభుత్వం ప్రజలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నో ఆకాంక్షలతో పోరాటాలు, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు పదేళ్ల బీఆరెస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేకపోయారన్నారు. గత ప్రభుత్వం పదేళ్లుగా ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని,అందుకే ప్రజాపాలన సభలతో మీ దగ్గరకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, రాష్ట్ర ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, హనుమంతరావు, శ్రుతి ఓజా, రాచకొండ సీపీ సుధీర్ బాబులు పాల్గొన్నారు.