Jaggareddy | మీ పాలనలో ప్రోటోకాల్ పాటించారా .. బీఆరెస్‌పై జగ్గారెడ్డి ఫైర్

బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించని కేటీఆర్‌, హరీశ్‌రావులకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు

Jaggareddy | మీ పాలనలో ప్రోటోకాల్ పాటించారా .. బీఆరెస్‌పై జగ్గారెడ్డి ఫైర్

విధాత, హైదరాబాద్‌ : బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించని కేటీఆర్‌, హరీశ్‌రావులకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వారి పాలన హయంలో గుర్తుకు రాని ప్రోటోకాల్‌పై ఇప్పుడు వారికి గగ్గోలు ఎందుకని మండిపడ్డారు. గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాలంలో తాను కూడా ప్రోటోకాల్ బాధితుడేనని గుర్తు చేశారు. సంగారెడ్డిలో నన్ను విపక్ష ఎమ్మెల్యేగా అవమానించారని… అయినా పెద్ద మనసుతో నేను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టేవారని.. ఆ సమయంలో హరీశ్‌ రావు, జిల్లా కలెక్టర్ పక్కనే ఉండేవారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులు ఈ రోజుల్లో సహజ అంశంగా మారిపోయాయని, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నాయకులు పార్టీలు మారడం సహజమని అది చర్చనీయాంశమే కాదన్నారు. గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారు ఇప్పుడు మళ్లీ వస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. నా దృష్టిలో పార్టీ ఫిరాయింపులు అసలు సీరియస్ మ్యాటర్‌ కాదని అన్నారు. ప్రజలు కూడా పార్టీ ఫిరాయింపులను సీరియస్‌గా తీసుకోవడం లేదని, అత్తగారి ఇల్లు.. తల్లిగారి ఇల్లులా రాజకీయాలు మారాయని ఈ విషయంపై పదేపదే చర్చించడం అనవసరమన్నారు.