మావోయిస్టుల్లో విభేదాలు? సాయుధ పోరాటంపై భిన్నాభిప్రాయం? సమన్వయం లేకుండా పలు ప్రకటనలు
పార్టీలో ఏం జరుగుతున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- మావోయిస్టుల్లో విభేదాలు?
- సమన్వయం లేకుండా పలు ప్రకటనలు
- గందరగోళంలో శ్రేణులు, అభిమానులు
- సంస్థాగత వారోత్సవాలకు సీసీ పిలుపు
- ఆయుధాలు వదిలేస్తామని అభయ్ ప్రకటన
- పశ్చాతాపం ప్రకటించిన సోనూ సుదీర్ఘ లేఖ
- అభయ్ లేఖపై జగన్ తీవ్ర అభ్యంతరాలు
- సాయుధ పోరాటంపై భిన్నాభిప్రాయం?
- కేంద్ర కమిటీ స్పందిస్తేనే పూర్తి వివరాలు!
విధాత ప్రత్యేక ప్రతినిధి: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ఏం జరుగుతున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో సమన్వయం కొరవడిందనే అంశం ఇదమిద్ధంగా రూఢీ అవుతున్నదని విప్లవ పార్టీల వ్యవహారాలను పరిశీలించేవారు చెబుతున్నారు. మావోయిస్టులు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అత్యంత క్రూరమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ఇంతటి తీవ్ర నిర్భంధ పరిస్థితుల్లో సమన్వయం సాధించడం సులువైన విషయం కానప్పటికీ, దీనికి మించి పార్టీలో ‘విభేదాలు’ ఏమైనా పొడచూపాయా? లేదా.. శత్రువు ఆడుతున్న నాటకంలో పావులుగా మారుతున్నారా? అనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంచలన రేపిన సోను ప్రకటన
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అభయ్ అలియాస్ సోనూ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ పేరుతో ‘సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా’ విరమిస్తున్నట్లు విడుదలైన ప్రకటన ఆ పార్టీనే కాకుండా విప్లవాభిమానులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. సెప్టెంబర్ 17వ తేదీన వెలుగు చూసిన ఈ ప్రకటనపై ఆగస్టు 15వ తేదీ ఉండటం, ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడుగా రెండవ రోజు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సొనూ పేరుతో విడుదలైన ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ మరింత ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 శుక్రవారం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో అభయ్ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ, ఒక విధంగా విమర్శిస్తూ ప్రకటన వెలువడంతో భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం వెలుగుచూసింది. మూడు ప్రకటన సారాంశాన్ని గమనిస్తే.. సాయుధ పోరాటాన్ని కొనసాగించడం, లేదా విరమించడం అనే అంశాలపై మావోయిస్టు పార్టీలో విభేదాలు నెలకొన్నయా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. మరోసారి పార్టీ కేంద్ర కమిటీ స్థాయిలో వివరణమైన ప్రకటన వెలువడే వరకు ఈ అనుమానాలు, ప్రశ్నలు, ఊహాగానాలు సాగుతూనే ఉంటాయని అంటున్నారు. కగార్ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత ఆ పార్టీ ఊహించని స్థాయి నాయకత్వ, కేడర్ నష్టాన్ని చవిచూస్తున్నది. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో పదులు, ఇరవైల సంఖ్యలో చనిపోతున్నారు. ఇటీవల కాలంలో 366 మంది చనిపోయారని ఆ పార్టీ కేంద్ర కమిటీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంటున్నది. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్‌కౌంటర్‌లో అంతమొందించిన తీవ్ర నిర్బంధ పరిస్థితిలో అంతర్గతంగా ఉండే అభిప్రాయాలు బహిర్గతమయ్యే వాతావరణం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
చర్చల నుంచి.. సాయుధ పోరాట విరమణ
కగార్ ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టులతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపాలనే డిమాండ్ తెలంగాణలో ప్రారంభమై ఇతర ప్రాంతాలకు విస్తరించింది. జనవరి నుంచి సాగిన ప్రయత్నాలు ఫలించి, మార్చి 28న శాంతి చర్చల కమిటీ ఏర్పడి కేంద్రానికి, మావోయిస్టు పార్టీకి చర్చల కోసం విన్నవించారు. దీనిపై ఏప్రిల్ 4వ తేదీన మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పందించి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే.. నెల పాటు కాల్పలు విరమణను షరతుగా పెట్టారు. చర్చలపై మే 10వ తేదీ అభయ్ మరో రెండుసార్లు, రూపేష్ ఒక పర్యాయం స్పందించారు. 10వ తేదీ ప్రకటన తర్వాత కాల్పుల విరమణతో పాటు తాత్కాలికంగా ఆయుధాలు వదులుకునేందుకు సిద్ధమైనట్లుగా చర్చోపచర్చలు సాగాయి. అప్పట్లో ఈ ప్రకటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రకటనపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోగా కర్రెగుట్ట తదితర ప్రాంతాల్లో దాడులు తీవ్రం చేసింది. ఈ క్రమంలో మే 21న మాడ్ అటవీప్రాంతంలోని గుండెకోట్‌లో జరిగిన దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 28 మంది కేంద్రకమిటీ సిబ్బంది, సహచరులు ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఒక ప్రధాన కార్యదర్శి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం భారత విప్లవోద్యమ చరిత్రలో అత్యంత కీలక అంశంగా అంతా భావించారు.
అమరుల సంస్మరణకు పిలుపు
నంబాల మృతి తర్వాత తొలిసారి జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించాలని కేంద్ర కమిటీ పేరుతో సుదీర్ఘ ప్రకటన విడుదలైంది. కగార్ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను గెరిల్లా పోరాటంలో సమీకరిద్దామని జూన్ 23న పిలుపునిచ్చారు. ఈ ప్రకటనలో అనేక అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాల స్థానంలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఎన్నికైనట్లు వార్తలు వెలువడ్డాయి. దేవ్ జీ సమాచారం ప్రచారమైన తర్వాత సెప్టెంబర్ 6న మరోసారి కేంద్ర కమిటీ పేరుతో 10 పేజీల సందేశాన్ని విడుదల చేశారు. ఈ ప్రకటనలో కూడా ఆపరేషన్ కగార్ యుద్ధాన్ని తిప్పికొట్టేందుకు గెరిల్లా పోరాటాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
ఆకస్మికంగా అభయ్ ప్రకటన
ఆటుపోట్లలోనూ ముందుకే వెళ్లాలని పార్టీ నిర్ణయించిందని భావించిన తరుణంలో సెప్టెంబర్ 17న అభయ్ పేరుతో తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన ఫోటోతో ఉన్న ప్రకటన, ఆడియా విడుదల కావడం తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో మరో సుదీర్ఘ లేఖ మొత్తం పార్టీ, విప్లవోద్యమ ఆటుపోట్లపై వ్యాఖ్యానిస్తూ సోనూ పేరుతో లీక్ కావడం తీవ్ర చర్చకు తావిచ్చింది. ఆగస్టులో ఈ లేఖలు రాస్తే సెప్టెంబర్ లో విడుదల కావడం గమనార్హం. ఈ ప్రకటనలకు ముందు రెండు పర్యాయాలు కేంద్ర కమిటీ పేరుతో సుదీర్ఘ సందేశాలు విడుదలయ్యాయి. ఈ లేఖ ఆగస్టులో రూపొందించినప్పటికీ కేంద్ర కమిటీ నిర్ణయం తర్వాత నిలిపివేశారా? నిలిపివేస్తే ఇప్పుడు ఎలా బయటికి వచ్చింది? లేదా పోలీసు దాడుల్లో ఈ లేఖ దొరికిందా? వారు బయటికి లీక్ చేశారా? లేదా.. అభయ్, మరికొందరికి ఉన్న అభిప్రాయాలను ఈ లేఖ రూపంలో విడుదల చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అభయ్ ప్రకటనకు జగన్ ఖండన
పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న సోను ప్రకటనను కింది కమిటీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ తాజాగా ఖండించడం గమనార్హం. ఈ ప్రకటనలో సొనూకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చని, కానీ.. వీటిని బహిరంగ పరిచి పార్టీని, కేడర్‌ను గందరగోళపరచడం సరైంది కాదని పేర్కొనడం గమనార్హం. జగన్ ప్రకటనపై సోను ఏ విధంగా ప్రతిస్పందిస్తారో అనే చర్చ సాగుతోంది.