Eatala Rajender : నేను పార్టీ మారడం లేదు
ఈటల రాజేందర్ పార్టీ మారడం లేదు అని ఖండించారు; సోషల్ మీడియా, యూట్యూబ్ వార్తలను తీరా సరిచేశారు.

విధాత, హైదరాబాద్ : పార్టీ మారుతున్నానంటూ కొన్ని మీడియా, వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానల్ లలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బురద చల్లి కడుక్కోమనటం.. బట్ట కాల్చి మీద వేయడం.. మంచిది కాదన్నారు. నేను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదు అని స్పష్టం చేశారు. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు అని..పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి.. గొప్ప కారణం ఉండాలి అన్నారు.
బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపిస్తే వచ్చాను తప్ప నా అంతట నేను రాలేదు అని గుర్తు చేశారు. ఆ సమయంలో నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని ఈటల పేర్కొన్నారు. పార్టీ మారుతున్నానంటూ రాస్తున్న వార్తలను, చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని..పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదు అన్నారు. వ్యక్తిత్వ హననం చేయకండి..ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఈటల రాజేందర్ పేర్కొన్నారు.