టీఆర్‌ఎస్‌కు సిలిండర్‌ గుర్తు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

టీఆర్‌ఎస్‌కు సిలిండర్‌ గుర్తు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

విధాత :తెలంగాణ రాజ్య సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్‌ను గుర్తు కేటాయించింది. సిద్ధిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం రిజిస్ట్రర్ చేసిన ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 119స్థానాల్లో పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి తెలిపింది. టీఆర్‌ఎస్ వినతి మేరకు ఆ పార్టీ అభ్యర్థులకు అన్ని స్థానాల్లో సిలిండర్ గుర్తు కేటాయించిన ఈసీ కొన్ని షరతులు పెట్టింది.


ఎన్నికల సంఘం నిబంధనల మేరకు టీఆర్‌ఎస్ పార్టీ తరుపున కనీసం 5శాతం సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాలని , లేదంటే ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో సిలిండర్ గుర్తును ఇతరులకు కేటాయిస్తామని ఆదేశాల్లో పేర్కోంది. వాస్తవంగా సీఎం కేసీఆర్ తన టీఆర్‌ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ బీఆరెస్‌గా పేరు మార్చుకున్నారు. ఇదే సమయంలో బాలరంగం తెలంగాణ రాజ్య సమితి పేరుతో తన పార్టీని రిజిస్ట్రర్ చేసుకున్నారు.


మంత్రి హరీశ్‌రావుకు సన్నిహితుడైన తుపాకుల బాలరంగం స్వగ్రామం సిద్ధిపేట జిల్లా పొన్నాల . 1983నుంచి కేసీఆర్‌తో ఉంటూ వస్తున్న బాలరంగం 1987లో, 1995లో పొన్నాల సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2001లో సిద్ధిపేట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా, 2006లో సిద్ధిపేట జడ్పీటీసీగా, 2019నుంచి 2021వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహారించారు.ఇతరులెవరు టీఆర్‌ఎస్ పేరుతో తమకు వ్యతిరేక రాజకీయాలు చేయకుండా ముందు జాగ్రత్తగా కేసీఆర్ కుటుంబమే బాలరంగంతో టీఆర్‌ఎస్ పార్టీని రిజిస్ట్రర్ చేయించారని భావిస్తున్నారు.