Kaleshwaram | కాళేశ్వరం దోపిడిపై ఈడీ నజర్

Kaleshwaram | బీఆర్ఎస్ ప్రభుత్వ( BRS Govt ) హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) దేశంలో అతి పెద్ద కుంభకోణంగా పేరొందిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు ఇంజినీరింగ్ అధికారుల అక్రమార్జన బహిరంగ మార్కెట్ లో రూ.800 కోట్ల పైగా ఉన్నట్లు తెలంగాణ( Telangana ) అవినీతి నిరోధక విభాగం ( ACB ) ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.

Kaleshwaram | కాళేశ్వరం దోపిడిపై ఈడీ నజర్

సీఐఆర్ నమోదుకు సిద్ధం?
ఇక దోపిడిదారులకు నిద్రలేని రాత్రులే!

Kaleshwaram | విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ( BRS Govt ) హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) దేశంలో అతి పెద్ద కుంభకోణంగా పేరొందిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు ఇంజినీరింగ్ అధికారుల అక్రమార్జన బహిరంగ మార్కెట్ లో రూ.800 కోట్ల పైగా ఉన్నట్లు తెలంగాణ( Telangana ) అవినీతి నిరోధక విభాగం ( ACB ) ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇప్పటికే ఈ కుంభకోణం పై ఏసీబీ విచారణ జరుగుతుండగా, త్వరలో ఈడీ రంగప్రవేశం చేసే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురు అక్రమంగా అర్జించిన సొమ్మును పలు మార్గాలలో మళ్ళించడమే కాకుండా బినామీల పేర్ల మీద పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. ఇందులో నిధుల మళ్లింపు వ్యవహారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ కింద వస్తుందనే విషయాన్ని ఈడీ పరిగణనలోకి తీసుకున్నది. దీంతో ముగ్గురిపై ఈసీఐఆర్ నమోదు కోసం తెలంగాణ ఏసీబీ నుంచి కేసు వివరాలు, డాక్యుమెంట్లు తెప్పించుకోవాలనే నిర్ణయానికి ఈడీ వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పిన ఇంజనీరింగ్ అధికారులపై దాడులు నిర్వహించింది. ఇంజినీర్ ఇన్ ఛీప్ (రిటైర్డు) సి.మురళీధర్ రావు, కాళేశ్వరం కార్పొరేషన్ ఈడీ, ఇంజినీర్ ఇన్ ఛీఫ్ భూక్యా హరిరామ్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ నివాసాలు, కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసి విలువైన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, లాకర్ల సమాచారం, బ్యాంకు డిపాజిట్లు, బినామీల పేర్లతో లావాదేవీలు వంటి ముఖ్యమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిపై జూన్, జూలై నెలలో ఏసీబీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. వీరి ఆస్తుల విలువను బహిరంగ మార్కెట్ లో లెక్కించిన అధికారులు కంగుతిన్నారు. ముగ్గురు ఇంజినీరింగ్ అధికారులే ఇంత భారీ మొత్తంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టారంటే, పై స్థాయిలో అవినీతి ఇంకా ఎక్కువగా ఉండవచ్చని నీటి పారుదల శాఖ సిబ్బంది చర్చించుకున్నారు. ఇలా అక్రమ మార్గంలో ఆర్జించిన సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించి దూరపు బంధువులు, స్నేహితులు, ఉద్యోగుల పేర్ల మీద పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీకి సమాచారం అందింది. ఏసీబీ నుంచి అందే అధికారిక వివరాల ఆధారంగా త్వరలోనే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసే అవకాశముంది. కేసు నమోదు అయిన తరువాత పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఆరు నెలల వ్యవధిలో వారి ఆస్తులను జప్తు చేయనున్నారు. ఈ కేసు ముగ్గురికే పరిమితం అయ్యే పరిమితం అయ్యే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారుల మెడకు చుట్టుకోవం ఖాయంగా కన్పిస్తున్నది.

ఆ అధికారులపై వేటు పడేనా?

పీసీ ఘోష్ కమిషన్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో దాదాపు రెండు వందల మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అలాగే కొంత మందిపై క్రిమినల్ చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని తెలిపింది. దీంతో కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఆ అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోన‌న్న ఆస్త‌కి నెలకొన్నది. అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అయిన ఎస్‌.కే. జోషి ప్రాజెక్టులో జరిగిన తీవ్రమైన లోపాలకు బాధ్యత వహించాలని పేర్కొంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌పై కూడా చర్యలు తీసుకోవచ్చని వెల్లడించింది. వీరితో పాటు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి, ఆర్థికశాఖ‌ కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శిలపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు మెంబర్స్ అందరిపై, ఈఎన్‌సీ సీ. మురళీధర్, హైపవర్ కమిటీ మెంబర్స్ ఈఎన్‌సీ ఎన్. వెంకటేశ్వర్లు, సీఈ బీ.హరిబాబు, సీఈ టీ.శ్రీనివాస్, సీఈ ఏ. నరేందర్ రెడ్డి, ఎస్‌ఈ కే.ఎస్.ఎస్. చంద్రశేఖర్, ఈఈ బసవరాజు, సీఈ జే. శ్రీదేవి, సీఈ జీ. రమేశ్, సీఈ జే. ఆశిర్వాదం, స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఈఎన్‌సీ జీ. అనిల్ కుమార్, ఈఎన్‌సీ బీ. నాగేందర్ రావు, సీఈ టీ. పరిమళ, సీఈ శంకర్ నాయక్ ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఫార‌సు చేసింది. అలాగే తప్పుడు సాక్ష్యాలు చెప్పిన సీఈ టీ. శ్రీనివాస్, ఈఈ సర్దార్ ఓంకార్ సింగ్, సీఈ బీ. హరిరామ్, సీఈ ఏ. నరేందర్ రెడ్డిల‌పై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చిని ఘోష్ కమిషన్ వెల్లడించింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అధికారులు అందరిలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.