Etela Rajender| పార్టీ మార్పుపై ఎంపీ ఈటల స్ట్రాంగ్ రియాక్షన్

బీజేపీ నుంచి నిష్క్రమిస్తానని...పార్టీ మారుతానంటూ తనపై సాగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని మాజీ మంత్రి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కొట్టిపారేశారు.

విధాత, హైదరాబాద్ : బీజేపీ నుంచి నిష్క్రమిస్తానని…పార్టీ మారుతానంటూ తనపై సాగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని మాజీ మంత్రి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను, బొడిగే శోభ పార్టీ మారతారని పిచ్చి ప్రచారం చేస్తున్నారని..అదంత బోగస్ ప్రచారం అని మండిపడ్డారు. పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదు అన్నారు. మా పార్టీలోనే అలాంటి ప్రచారానికి కొందరు ఊతమిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదు అన్నారు. నాలాంటి వ్యక్తులు పార్టీలు మారకూడదన్న సందేశాన్ని గతంలోనే నేను ఇచ్చిన సంగతి మరువరాదన్నారు. సందర్బం వచ్చినప్పుడు ఈటెల సత్తా ఏమిటో అందరికి తెలుస్తుందన్నారు. డబ్బులు నమ్ముకున్న వారు ఓ వైపు, ప్రజలను నమ్ముకున్న వారు ఇంకోవైపు ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయం అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఏర్పడిందని, అయితే గతంలో కేసీఆర్ తరహాలోనే మీడియాను గుప్పిట పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజావ్యతిరేకతను దాచిపెడుతుందని, కాని ప్రజలు అన్ని గమనిస్తునే ఉన్నారన్నారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం మా పార్టీ ప్రజా ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు కార్పోరేషన్లను గెలవడంతో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలు కూడా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఛలో బాలాజీ నగర్ ఆందోళనతో అక్కడి ప్రజల సమస్యల పరిష్కారంపై పోరాడబోతున్నామన్నారు. హైడ్రా పేరుతో, ఆస్తులు, భూముల ఆక్రమణలతో రేవంత్ సర్కార్ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుందన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తరహాలోనే ఎగవేత ధోరణి అనుసరిస్తుందన్నారు. సీఎస్ఆర్ ఫండ్ కావాలని మేం కోరడం జరిగిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ పై అసత్య ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల పునాదులపై మనుగడ సాగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నన్ను మెడలు పట్టి, బయటకు నెట్టి, బర్తరఫ్ చేశారని, సొంత మీడియాలో నాపై దుష్ప్రచారం చేసి బయట ప్రజలకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు సృష్టించి కేసీఆర్ నన్ను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు అవుతుందన్నారు. కేసీఆర్ తన అధికార దుర్వినియోగంతో 70కోట్లతో నా ఫ్లాంట్లను, షెడ్లను కూల్చివేయించారని, రెవెన్యూ సర్వేల పేరుతో, దళితులతో ధర్నాల పేరుతో వేధించారని, భూములు గుంజుకున్నారని గుర్తు చేశారు. వాటిపై నేను ఈ ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానన్నారు. ఆనాడు చెప్పుకుందాం అన్నా ఎవరూ మా బాధ వినలేని పరిస్థితి అని, అలాంటి అనివార్యమైన క్లిష్ట పరిస్థితుల మధ్య బీజేపీలో మేం చేరడం జరిగిందన్నారు. నేను 20ఏళ్లు బీఆర్ఎస్ లో ఉన్నందునా…నాకు ఆ పార్టీలో అభిమానులు, పరిచయాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ నాతో పాటు తుమ్మల, పొంగులేగి, జితేందర్ రెడ్డి, కడియం, బొడిగే శోభ సహా అనేకమంది మాజీ మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలను దూరం చేసుకున్నారన్నారు. మళ్లీ ఇలాంటి వారితో కేసీఆర్ కలుస్తారన్న చర్చ లేపారని, అలాంటి పిచ్చి చర్చలతో మా వ్యక్తిత్వాన్ని హననం చేయవద్దన్నారు.

Latest News