ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినా బీఅరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.

విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినా బీఅరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో కవిత కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ కేసులో కస్టడీకి సంబంధించి మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరుగనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఅరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో కవిత కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు 14రోజులు మాత్రమే రిమాండ్ పొడిగిస్తూ వచ్చిన కోర్టు ఈ దఫా ఏకంగా నెల రోజుల పాటు పొడిగించడం విశేషం. లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవిత మార్చి 26న నుంచి జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉంటున్నారు. కవితకు గతంలో విధించిన కస్టడీ సోమవారంతో ముగిసిన నేపథ్యంలో ఆమెను కోర్టు ముందు హజరుపరిచారు. కోర్టు హాల్‌లోకి వెళుతున్న క్రమంలో కవిత జై తెలంగాణ, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను కూడా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. వారి పాస్ పోర్టు సరెండర్ చేయాలంటూ నిందితులను కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన చరణ్ ప్రీత్ కేసు విచారణను జులై 3కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కవితకు నెల రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించడంతో ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. సీబీఐ కేసులోనూ కవిత కస్టడీ ఇదే రోజు ముగిసిపోగా, కోర్టు విచారణకు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 7వరకు పొడిగించింది. అదే రోజున సీబీఐ తన చార్జిషీట్ దాఖలు చేయనుంది.
292కోట్ల నేరంలో కవిత పాత్ర
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఈడీ ఈనెల 10న చార్జిషీట్‌లో తీవ్ర అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 1100కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కోంది. కవిత భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్ 192కోట్ల లాభాలను పొందిందని, ఆమ్ ఆద్మీ పార్టీకి 100కోట్ల ముడుపులు ఇచ్చారని ఆరోపించింది. మొత్తం కవిత 292కోట్ల నేరంలో కవిత కీలక పాత్ర ధారి అని పేర్కోంది. కవిత ఈ కేసులో డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కోంది. ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను కవిత బెయిల్ పిటిషన్ విచారణలో పరిగణలోకి తీసుకుంటామని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయపూర్తి కావేరీ బజా ఇప్పటికే వెల్లడించారు. ఈ నెల 7న సీబీఐ కూడా తన చార్జిషీట్ దాఖలు చేయబోతుంది.
ఈడీ చార్జిషీట్‌లో కవిత స్టేట్‌మెంట్
ఈడీ చార్జి షీట్‌లో కవిత స్టేట్‌మెంట్‌ను సైతం పొందుపరిచింది. ఇండో స్పిరిట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు సంబంధం లేదని, లిక్కర్ పాలసీ గురించి నేను ఎవరితో మాట్లాడలేదని కవిత తెలిపింది. బుచ్చిబాబు, రాఘవల మధ్య జరిగిన సంభాషణలు నాకు తెలియదని, వాళ్ల ఫోను నంబర్లు కూడా నాకు తెలియదని కవిత తన స్టేట్‌మెంట్‌లో పేర్కోంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో నా తరపున పాల్గొనాలని బుచ్చిబాబుకు ఆథరైజేషన్ ఇవ్వలేదని పేర్కోంది. నా తరఫున ఎవరు ఆప్ ను సంప్రదించలేదని, లంచాలు ఇవ్వలేదని తెలిపింది. అరుణ్ పిళ్లై నా ఫ్యామిలీ ఫ్రెండ్ అని, వీకెండ్‌లో తరుచూ కలుస్తుంటామని, అరుణ్ పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్లతో నాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇండోస్పిరిట్ లో అరుణ్ పిళ్లై నా తరఫున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, ఇండియా హెడ్ న్యూస్ ఛానల్‌లో అభిషేక్‌కు వాటాలు ఉన్నాయని నాకు తెలియదని, ఆ ఛానల్ లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్తు నన్ను కోరారని పేర్కోంది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి చాలాసార్లు కలిశారని, మాగుంట రాఘవరెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశాననని కవిత తెలిపినట్లుగా ఈడీ చార్జిషీట్ వెల్లడించింది.