Telangana Check Dam Blast : చెక్ డ్యాంల పేల్చివేత నిజమే : నిజనిర్ధారణ కమిటీ
తెలంగాణలో చెక్ డ్యాంల కూల్చివేత 'మానవ నిర్మిత విధ్వంసం' అని నిజనిర్ధారణ కమిటీ మరియు వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ తేల్చారు. ఇసుక మాఫియానే జిలెటిన్ స్టిక్స్‌తో వీటిని పేల్చివేసిందని పేర్కొన్నారు.
విధాత, హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్‌డ్యామ్, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్ లు సహజంగా కూలిపోలేదని..వాటిని దుండగులు ఉద్దేశపూర్వకంగా పేల్చివేశారని నిజనిర్ధారణ కమిటీ స్పష్టంచేసింది. ప్రభుత్వం ఈ చెక్ డ్యాంల ధ్వంసంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. తెలంగాణా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి. ప్రకాష్ ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి కీలక ప్రకటన చేసింది. ఆ రెండు చెక్ డ్యామ్ లను ఇసుక మాఫియా స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం పేల్చివేసిందని నిర్ధారించింది.
23కోట్లతో నిర్మించిన తనుగుల చెక్ డ్యామ్ ను నవంబర్ 21న రాత్రి 10గంటల ప్రాంతంలో జిలెటిన్ స్టిక్స్ సహాయంతో పేల్చివేశారని, దీనిపై స్థానిక ఇరిగేషన్ అధికారి పాలకుర్తి రవి జమ్మికుంట పీఎస్ లో ఫిర్యాదు చేశారని కమిటీ గుర్తు చేసింది. క్షేత్ర స్థాయి పరిశీలనో అదంతా నిజమేనని తేలిందని, స్థానిక రైతులు కూడా పేలుడు శబ్ధం విన్నారని, పేలుడు చర్యలకు ఇసుక మాఫియా కారణమని గుర్తించామన పేర్కొంది. పేలుడు కారణంగా చెక్ డ్యాం పేల్చివేతతో 5మిలియన్ ఘటపు అడుగుల నీరు కిందకు వెళ్లిపోయి రైతాంగానికి, భూగర్బ జలాలపై ఆధారపడిన బోరుబావులకు నష్టం జరిగిందని కమిటీ ఆందోళన వెలిబుచ్చింది.
అడవి సోమస్ పల్లి చెక్ డ్యాం ను కూడా ఇసుక మాఫీయా ఈ నెల 17న పేల్చివేసిందని తెలిపారు. పేలుడు ఎగిరిపడిన చెక్ డ్యాం శకలాలు దానిని పేల్చివేశారడానికి నిదర్శనమన్నారు. గతంలో 2024జనవరి 16న జరిగిన హుసెన్ మియావాగు చెక్ డ్యాం పేల్చివేతపై ఆధారాలతో సహా కేసు నమూదైనప్పటికి నేటికి దర్యాప్తు పూర్తి కాలేదని, నిందితులకు శిక్ష పడలేదని కమిటీ ఆరోపించింది.
తెలంగాణా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి. ప్రకాష్ ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీలో ప్రొఫెసర్ సీతారామారావు( అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ మాజీ ఉప కులపతి), ప్రొఫెసర్ రాఘవ రెడ్డి( హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం), దామోదర్ రెడ్డి(విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీటి శాఖ), శ్రీధర్ రావు దేశ్ పాండే(విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీటి శాఖ), పిట్టల రవీందర్(సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణా JAC మాజీ రాష్ట్ర కోఆర్డినేటర్), ఎర్రోజు శ్రీనివాస్ (తెలంగాణా వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి), మల్లావజుల విజయానంద్ (తెలంగాణా వికాస సమితి ఉపాధ్యక్షులు), బుచ్చన్న(సీనియర్ జర్న లిస్టు), శంకర్ (సీనియర్ జర్నలిస్టు) లు ఉన్నారు.
వాటిని కూల్చేశారు: మెగసెసే అవార్డు గ్రహిత రాజేంద్ర సింగ్
కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని చెక్‌డ్యామ్‌లను కూల్చివేశారని, ఇది తన అనుభవంతో చెప్తున్నానని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ చెప్పారు. తనుగుల చెక్‌డ్యామ్, అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌ను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్ డ్యాంలను పరిశీలిస్తే జిలెటెన్‌స్టిక్స్‌తో పేల్చివేసినట్టు కనిపిస్తున్నదన్నారు. కూల్చివేతల పై ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేయడంతోపాటు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం జాప్యం చేసినా అది మరిన్ని చెక్‌డ్యామ్‌లకు ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో కూలిపోని చెక్‌డ్యామ్‌లు ఇప్పుడు ఎలా కూలాయన్న కోణంలో ఆలోచిస్తే.. నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగకుండా.. మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని స్పష్టంచేశారు.
తెలంగాణలో మాఫియా పాలన : కేటీఆర్
తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. “పక్కా మాఫియా పాలన” అని, నాడు ఎన్నికలకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు అని, నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్‌ల మీద జెలటిన్ స్టిక్స్‌తో బాంబులు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ “ఇది మానవ నిర్మిత విధ్వంసం” అని మొత్తుకుంటున్నా, ఈ ‘చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అని ఎక్స్ వేదికగా విమర్శించారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు అని, ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా? ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా? అని ప్రశ్నించారు.
భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్ డ్యామ్‌లు కడితే.. వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారు అని, మీ ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా? అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టు అన్నారు. ఇప్పుడు మీ సమాధానం ఏంటి రేవంత్ రెడ్డి? అని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో మీరు సిద్ధహస్తులు అని, తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజేంద్ర సింగ్ డిమాండ్ చేసినట్లు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందేనని.. లేదంటే ఈ బాంబుల సెగ మీ కుర్చీ దాకా రావడం ఖాయం అని కేటీఆర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
Harish Rao : జీవోలపై గోప్యత పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు
100 Weekend Wonders Contest : బంపర్ ఆఫర్..పర్యాటక ప్రాంతాలు పంపితే నగదు బహమతులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram