ప్రవళిక కేసులో బిగ్ ట్వీస్టు.. ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక..

  • Publish Date - October 17, 2023 / 10:40 AM IST

విధాత: గ్రూప్ 2 విద్యార్థి ప్రవళిక ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ అనే యువకుడి ప్రేమ వేధింపులే కారణమని ఆమె సోదరుడు మీడియాకు తెలిపాడు. శివరామ్ వేధింపులతోనే మా చెల్లి చనిపోయిందని, అతడిని కఠినంగా శిక్షించాలని ప్రవళిక సోదరుడు తెలిపారు. ప్రవళిక తల్లి సైతం తన కూతురు ఆత్మహత్యపై తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగవద్ధంటూ వేడుకున్నారు.


అయితే ప్రవళిక ఆత్మహత్య పరీక్షల వాయిదా, ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ వైఫల్యంతో నిరాశ చెందిన ప్రవళిక ఆత్మహత్యకుపాల్పడిందంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు మాత్రం ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రవళిక ఆత్మహత్య ఘటన ప్రభుత్వానికి సంకటంగా తయారైంది.


ఈ క్రమంలో ఇప్పుడు ప్రవళిక సోదరుడు కూడా చెల్లి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ప్రవళిక ఆత్మహత్యను ట్వీట్టర్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు తీవ్రంగా ఖండించారు. తమ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రవళిక కుటుంబ సభ్యులను వారు పరామర్శించనున్నారన్న ప్రచారం నేపధ్యంలో ప్రవళిక సోదరుడి ప్రకటన వెలువడటం చర్చనీయాంశమైంది.

Latest News