బీజేపీకి అసదుద్దీన్ బీ టీమ్…బురఖా ఓట్లు వేయడం వల్ల మోసం : ఫిరోజ్ ఖాన్
బీజేపీ, ఎంఐఎం ఇద్దరు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివని కాంగ్రెస్ పార్టీ నేత, నాంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు.

- బీజేపీకి అసదుద్దీన్ బీ టీమ్
- బురఖా వేసుకొని ఓట్లు వేయడం వల్ల మోసం
- ఎన్నికల కమిషన్‌కు డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్దం
- కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్ట్12(విధాత): బీజేపీ, ఎంఐఎం ఇద్దరు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివని కాంగ్రెస్ పార్టీ నేత, నాంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఓల్డ్ సిటీని చెత్త బుట్ట చేసిన అసదుద్దీన్ ఒవైసీ కి బెస్ట్ పార్లమెంటీరియన్ అవార్డ్ వస్తుందన్నారు. బీజేపీ కి బీ టీమ్ అసదుద్దీన్ ఓవైసీ అని ఆరోపించారు. ఎంఐఎంకు దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలవాలని ఆరోపించారు. ‘అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీ కాకుండా సికింద్రాబాద్‌లో పోటీ చేసి గెలవమనండి చూద్దాం. దొంగ ఓట్లను మనం పట్టుకోకపోతే రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టం. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశం ఎత్తుకోవడం సంతోషకరం. ఎన్నికల కమిషన్‌కు డిక్లరేషన్ కావాలంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇది పెద్ద క్రిమినల్ ఫ్రాడ్’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోనీ ఓట్లన్నీ దారు సలామ్ లో తయారవుతున్నాయని ఆరోపించారు. నాంపల్లిలో ప్రత్యర్థుల బోగస్ ఓట్లు, రౌడీయిజంతో తాను 2వేల ఓట్లతో ఓడిపోయానన్నారు. బురఖా వేసుకొని ఓట్లు వేయడం వల్ల మోసం జరుగుతుందన్నారు. బురఖా వేసుకున్న వాళ్ళు తన అక్కాచెల్లలు, తల్లులు.. వారంటే గౌరవం ఉందన్నారు. తాను బురఖా వేసుకొని దొంగ ఓట్లు వేసే వారి గురించే మాట్లాడుతున్నానని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు.