Warangal | వరంగల్లో వరద రాజకీయం.. నేతల నోట బురద మాటలు

Warangal | మరి రాజకీయం చేసేదెవరు? సర్వం కోల్పోయిన బాధితులు 30 మందిని బలిగొన్న వరదలు ఈ దుస్థితికి కారణమెవరు? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరుస వానలతో వరద సృష్టించిన భీభత్సంతో సకలం కోల్పోయి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు. 30 మంది ప్రాణాలు నీటకలిశాయి. వేలాది మంది బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ ఆపద కాలంలో అండగా నిలువాల్సిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాల నేతలు మాత్రం బురద మాటలతో వరద రాజకీయం […]

  • Publish Date - August 1, 2023 / 11:14 AM IST

Warangal |

  • మరి రాజకీయం చేసేదెవరు?
  • సర్వం కోల్పోయిన బాధితులు
  • 30 మందిని బలిగొన్న వరదలు
  • ఈ దుస్థితికి కారణమెవరు?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరుస వానలతో వరద సృష్టించిన భీభత్సంతో సకలం కోల్పోయి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు. 30 మంది ప్రాణాలు నీటకలిశాయి. వేలాది మంది బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ ఆపద కాలంలో అండగా నిలువాల్సిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాల నేతలు మాత్రం బురద మాటలతో వరద రాజకీయం చేస్తున్నారు. ప్రకృతి పైన పూర్తి నెపం నెట్టి తమ పాత్రేమీలేదంటూ తప్పించుకుని వచ్చే ఎన్నికల్లో మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

విచిత్రమేమిటంటే అన్ని పార్టీల నేతలు ఇదే మాట మాట్లాడడం విచిత్రం. సకాలంలో సహాయ చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకోవడంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానిది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీది, ఆ పార్టీ ప్రజాప్రతినిధులది ప్రధాన బాధ్యత. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర మంత్రులు, ఎంపీలది తరువాత బాధ్యత. కానీ, ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు విచిత్రంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఇదే సందర్భంలో వరదలో ప్రజలు ఇబ్బందులు పాలవుతున్న సమయంలో రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కష్ట సమయంలో ప్రజలున్నప్పుడు రాజకీయాలవుతావు లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంగా తమ వంతు వరద బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం సహకారంతో బీఆర్ఎస్ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నం చేశారు. విపక్షపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐతో పాటు ఇతర పక్షాల ప్రతినిధులు బాధితులకు అండగా ఉండేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఎన్నికల వేళ నేతల పోటాపోటీ

రానున్నవి ఎన్నికలు కావడంతో సహజంగానే సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ముందున్నారు. వీరికి పోటీగా విపక్షపార్టీల నాయకులు సైతం ఈ సమయంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీకి అధికార యంత్రాంగం అండదండలు లభించగా విపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. మూడు నాలుగు రోజులు వరదతో బురదతో కలిసి పనిచేశారు. బాధిత కుటుంబాలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

ఎన్టీఆర్ఎఫ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసుల సహకారంతో బోట్లు,ట్రాక్టర్లు వినియోగించి ఆదుకునేందుకు ప్రయత్నించారు. సర్కారు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. విపక్షాలు తమకు తోచిన పద్ధతిలో భోజనం, మంచి నీటి వసతలు సమకూర్చారు. గతంలో లేని విధంగా ఈ దఫా విపక్ష పార్టీ నాయకులు కొంత యాక్టివ్ గా పనిచేశారు.

ఇది అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నడూ లేనిది ఈ సారి పునరావాస శిబిరాలకు విపక్షపార్టీల నాయకులు రాకుండా అడ్డుకున్నారు. తాము మాత్రమే అండగా ఉన్నామని చాటుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. బీఆర్ఎస్ నాయకుల తీరుపట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.

రాజకీయాలు వద్దంటునే పరస్పర విమర్శలు

రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ వినయ్ మాట్లాడుతూ విపక్ష పార్టీలు వరదను రాజకీయం చేస్తున్నాయంటూ విమర్శలెక్కుపెట్టారు. వరదలో ప్రజలు అవస్థలుపడుతుంటే ప్రతపక్షపార్టీలు దీన్ని రాజకీయం చేస్తున్నాయంటూ విమర్శించడం గమనార్హం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండాయి గ్రామంలో వరదల్లో చాలా మంది చిక్కుకున్నారని, హెలికాప్టర్ ను పంపించాలని స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత ధనసరి సీతక్క కోరారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. దీన్ని అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రి సత్యవతి వ్యతిరేకించారు.

కొందరు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా సీతక్క ఓట్ల కోసం ఏడుస్తూ డ్రామా చేస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టడం పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తదుపరి వరంగల్ నగరంలో భద్రకాళి చెరువుకు గండిపడిన సమయంలోనూ ప్రజాప్రతినిధులు ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా వరద బాధితులను పరామర్శించేందుకు వరంగల్ కు వచ్చిన బీజేపీ నేత ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం కేసీఆర్, మంత్రి కేటఆర్ లపై విమర్శలు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోరంచపల్లి, వరంగల్ సిటీలో పర్యటించారు.

వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు చేసే సందర్భం కాదంటూ మాట్లాడారు.అయితే పరోక్షంగా సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని, రూ.900 కోట్ల విపత్తు నివారణ నిధులున్నాయంటూ ఎత్తి చూపారు. కేంద్ర సహాయం గురించి ప్రశ్నిస్తే కేంద్ర బృందం పర్యటన అనంతర ప్రకటిస్తారంటూ దాటవేశారు.

ఇదే విషయాన్ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ బోయినపల్లి, చీఫ్ విప్ వినయ్ విమర్శించారు. కిషన్ రెడ్డి టూరిస్టుగా మారారని ఎద్దేవా చేశారు. సోమవారం వరంగల్ నగరంలో పర్యటించిన కాంగ్రస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయకుండా, వరదల పై కనీస అంచనా లేకుండా, వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల పై నిఘా లేకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల, నగరంలో ఉన్న చెరువుల కట్టలు తెగి, నీళ్లన్ని కాలనీల్లోకి, ఇళ్లల్లోకి చేరాయన్నారు.

భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ మూడు రోజులు ముందుగానే ముందస్తుగా హెచ్చరించినా ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు నగర ప్రజలకు ఈ దుస్థితి పట్టిందన్నారు. నీటమునిగి ఆర్ధికంగా నష్టపోయి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. వరద బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.పైకి రాజకీయాలు వద్దంటునే అందరూ నాయకులుపరస్పరం విమర్శించుకోవడం కొత్త రాజకీయంగా చెప్పవచ్చు.

ఎన్నికల వేళ బాధితులను ఓటర్లుగా భావించి వారి పట్ల కనబరిచే కొత్త ప్రేమగా చెబుతున్నారు. రాజకీయా లు వద్దంటూనే విమర్శలు చేసుకోవడాన్ని చూసి జనం ముక్కునవేలేసుకుంటున్నారు. మరి ఎవరూ ఏ సమస్యను లేవనెత్తకుంటే ఈ దుస్థితికి కారణమెవరో తేలెదెట్ల అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తం నెపాన్ని ప్రకృతి పైకి నెట్టిసర్వం కోల్పోయి కన్నీరుపెడుతున్న ప్రజలను, 30మందిని కోల్పోయిన బాధితులను మరోసారి వరదలో, నిండా బురద రాజకీయంలో ముంచే ప్రయత్నంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.