Ravinder Singh | మంత్రి ఉత్తమ్ తప్పు చేయకపోతే టెండర్లు రద్దు చేయాలి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ధాన్యం లిఫ్టింగ్..సన్న బియ్యం కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరుగలేదని చెప్పడం బుకాయింపు మాటలేనని, ఉత్తమ్ తప్పు చేయలేదనుకుంటే సంబంధిత టెండర్లను రద్ధు చేసి నిజాయితీ నిరుపించుకోవాలని పౌరసరఫరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు

పౌరసరఫరాల కార్పోరేషన్ మాజీ చైర్మన్ రవిందర్ సింగ్
విధాత: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ధాన్యం లిఫ్టింగ్..సన్న బియ్యం కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరుగలేదని చెప్పడం బుకాయింపు మాటలేనని, ఉత్తమ్ తప్పు చేయలేదనుకుంటే సంబంధిత టెండర్లను రద్ధు చేసి నిజాయితీ నిరుపించుకోవాలని పౌరసరఫరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖ టెండర్లలో జరిగిన అవినీతిపై కేటీఆర్ ఆధారాలతో సహా ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. కేటీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పలేదన్నారు.
ధాన్యానికి రూ.2007రూపాయలని టెండర్లలో నిర్ణయిస్తే రూ.2230లను టెండర్ ఏజెన్సీలు రైస్ మిల్లర్ల దగ్గర వసూల్ చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టి బాండ్ పేపర్లు రాయించుకున్నారా లేదా అన్నదానిపై ఉత్తమ్ సమాధానం చెప్పలేదన్నారు. సన్న బియ్యం గింజ కూడా తీసుకోలేదని ఉత్తమ్ చెప్పారని, అలాంటపుడు టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. రూ.57 రూపాయలకు సన్న బియ్యం కొనాలని ప్రభుత్వమే టెండర్లలో రేటు నిర్ణయించింది నిజం కాదా? అని అడిగారు. ప్రభుత్వమే అంత రేటు నిర్ణయిస్తే బహిరంగ మార్కెట్ లో ధరల పరిస్థితి ఏమిటి ? ప్రజలపై భారం పడదా? అని రవిందర్‌సింగ్ నిలదీశారు.
యుద్ధ విమానాలు నడిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ఆదాయం పెంచుతున్నామని చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఎట్లా ఆదాయం పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు కారణమైన సివిల్ సప్లైస్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పౌరసరఫరాల శాఖపై ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో రైతుల ధాన్యం, మధ్యాహ్న భోజనంతో ముడిపడిన ఆ శాఖ పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.