ఘనంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌ రెడ్డి 82వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు

ఘనంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు

– నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

విధాత, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌ రెడ్డి 82వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీవీఎన్ఆర్ మార్గ్ స్ఫూర్తి స్థల్ లో జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మల్లు రవి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డి పాటించిన నైతిక విలువలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. జైపాల్ రెడ్డి ఓ మహా నాయకుడని, దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసున్నారని తెలిపారు.



 


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించారని, హైద‌రాబాద్ కు మెట్రో రావ‌డంలో జైపాల్ రెడ్డి కృషి ఎంతో ఉందని అన్నారు. జైపాల్ రెడ్డి చొర‌వ‌తోనే క‌ల్వ‌కుర్తి ఎత్తిపోతల ప‌థ‌కం సాకార‌మైందని, ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా స‌స్య‌శ్యామ‌లం అయ్యేందుకు ఆయ‌నే పునాదులు వేశారని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి జైపాల్ రెడ్డి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయ‌న చేసిన సేవ‌లకు గుర్తుగా జైపాల్ రెడ్డి జ‌యంతి వేడుకలను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హిస్తున్నట్లు పేర్కొన్నారు.