Actor Rahul Ramakrishna | పాలన, పరిపాలన గురించి నాకేం తెలుసు?: నటుడు రాహుల్ రామకృష్ణ యూటర్న్

రాహుల్ రామకృష్ణ ప్రభుత్వం పై ట్వీట్లు చేసిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు, ఇక రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సినిమా పనిపై దృష్టి పెట్టనున్నారు.

Actor Rahul Ramakrishna | పాలన, పరిపాలన గురించి నాకేం తెలుసు?: నటుడు రాహుల్ రామకృష్ణ యూటర్న్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస సంచలన ట్వీట్లతో హోరెత్తించిన నటుడు రాహుల్ రామకృష్ణ ఆ వెంటనే తన ట్విట్టర్ ఖాతాను స్తంభింపచేశారు. అయితే మరికొన్ని గంటల్లోనే మళ్లీ తన ఖాతాను పునరుద్దరించిన రాహుల్ రామకృష్ణా అంతకుముందు ప్రభుత్వంపై తను చేసిన విమర్శలకు విరుద్దంగా ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. ముందుగా ‘హైదరాబాద్ మళ్లీ మునిగింది.. హామీలన్నీ విఫలమయ్యాయి.. అన్నింటినీ గాడిన పెట్టడానికి కేసీఆర్, కేటీఆర్ మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారు’ అని రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా ట్వీట్ చేశారు. దుర్భర స్థితిలో బతుకుతున్నామని.. హామీలన్ని విఫలం అయ్యాయని ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదు’ అంటూ మరో ట్వీట్ చేశారు. రాహుల్ వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తన అకౌంట్ ను డియాక్టివేట్ చేసుకున్నారు.

ఆ తర్వాతా మళ్లీ యాక్టివేట్ అయిన రాహుల్ రామకృష్ణ నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమేనని..నా కంటే గొప్ప మేధావులు చాలా కాలంగా సామాజిక సమస్యలతో పోరాడుతున్నారని తెలిపారు. అనుభవజ్ఞులైన నాయకులతో సంభాషణల తర్వాత నా ఆందోళన తప్పుగా ఉందని నేను గ్రహించాను అని యూటర్న్ తీసుకున్నారు. వ్యవస్థను ఎవరు నడిపినా, ఎలా నడిపినా దేశానికి, ప్రజలకు మంచి జరగాలని మాత్రమే నేను కోరుకుంటున్నానంటూ వివాదానికి రాహుల్ రామకృష్ణ ముక్తాయింపు ఇచ్చారు. ఇకపై ట్విట్టర్ ద్వారా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా, తన వృత్తిపరమైన సినిమా పనిపైనే దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. చివరగా “జై తెలంగాణ, జై హింద్” అంటూ ట్వీట్ చేశారు.