Hyderabad’s real estate : 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీ
మూసీ వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.. మోదీ కంటే మంచి పేరు వస్తుందనే కిషన్ రెడ్డి మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు.. అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Hyderabad’s real estate: విశ్వ నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి నగరాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ రైజింగ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజలు ఏకోన్ముఖమై రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఇవ్వాళ్టికి ఏడాది పూర్తయిందన్న రేవంత్‌రెడ్డి.. వచ్చే ఏడాదికి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు..ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగు నీటి సమస్య పరిష్కారమైందన్నారు. హైదరాబాద్‌కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తెలంగాణ మణిహారంగా రూ.35 వేల కోట్లతో 360 కి.మీ.ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ట్యాంక్ బండ్‌ను మురికి కూపంలా మార్చారు
బీఆరెస్ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్‌ను మురికి కూపంగా మార్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పదేళ్లలో నగరానికి కావల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ఢిల్లీ నగరం పూర్తిగా కాలుష్యమయమైందని, ముంబైలో వరదలు వస్తే నివసించలేని పరిస్థితి నెలకొన్నదని, చెన్నైలోనూ వరదలు వస్తే గందరగోళ పరిస్థితి ఉంటుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, ఇక కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవని అన్నారు. దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమేనని అన్నారు. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి…. హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి.. అని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలన్నారు. నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.
రియల్ ఎస్టేట్ పెరిగింది
ఎంత మంది ఎంత విష ప్రచారం చేసినా.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజానికి రియల్ ఎస్టేట్ తమ హయాంలో పెరిగిందని చెప్పారు. ఏప్రిల్ 1 , 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు మీరు గమనించండి.. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు మా పాలనకు తేడా చూడండి.. మా పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది.. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదు.. ఇది మా నిబద్ధతకి నిదర్శనం.. అని రేవంత్‌రెడ్డి వివరించారు. చెరువుల ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టించిందన్నారు.
కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్
మూసీ వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.. మోదీ కంటే మంచి పేరు వస్తుందనే కిషన్ రెడ్డి మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు.. అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. మీకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తీసుకురా భూమి నేను చూపిస్తా.. పేదలకు మంచి అపార్ట్ మెంట్స్ కట్టిద్దాం.. మంచి భవిష్యత్ ఇద్దాం అన్నారు. మోదీ గుజరాత్ కి గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు.. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్? అని ప్రశ్నించారు. నగరంలో మెట్రో విస్తరణకు రూ.35వేల కోట్లు అవసరం ఉంది.. మీరు ఎన్ని నిధులు తెస్తారో చెప్పండి.. అని నిలదీశారు. మోదీ గుజరాత్ కు తీసుకెళుతుంటే గుడ్లు అప్పగించి చూస్తారా? మూసీలో పడుకోవడం కాదు…మోదీని తీసుకొచ్చి మూసీని చూపించు… పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో.. అని వ్యాఖ్యానించారు.