Gadwala MLA Krishnamohan Reddy | గద్వాల ఎమ్మెల్యే ‘ బండ్ల ‘ యూటర్న్ … కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి మళ్ళీ సొంత గూటికి

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చారు. జూలై 6 న రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

Gadwala MLA Krishnamohan Reddy | గద్వాల ఎమ్మెల్యే ‘ బండ్ల ‘ యూటర్న్ … కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి మళ్ళీ సొంత గూటికి

– బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన కృష్ణ మోహన్ రెడ్డి
– జూలై 6 న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి
– నెల రోజులు కాకముందే కాంగ్రెస్ ను వదిలి బీ ఆర్ ఎస్ లోకి
– కాంగ్రెస్ కండువా వేసుకోలేదని.. తాను వేసుకున్నది దేవుడి కండువా అని బుకాయించిన బండ్ల
– గద్వాల కాంగ్రెస్ నేతల సహకారం అందక యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం
– గద్వాల కు పట్టిన పీడ పోయిందంటున్నా కాంగ్రెస్ శ్రేణులు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చారు. జూలై 6 న రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బండ్ల చేరిక ను గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు అడ్డుపడినా ఎంపీ మల్లు రవి చొరవ తో ఆయన గులాబీ కండువా పక్కన పెట్టి సీఎం చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేరి నెల రోజులు కాకా ముందే సొంత పార్టీ బీ ఆర్ ఎస్ కు వెళ్ళారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కాంగ్రెస్ లో ఇమడలేక పోతున్నానని, మళ్ళీ మీరే అక్కున చేర్చుకోవాలని వేడుకున్నారు. బండ్ల విజ్ఞప్తి మేరకు కేటీఆర్ ఆయనను మళ్ళీ పార్టీ లోకి ఆవ్వానించారు.తాను కాంగ్రెస్ పార్టీ లో చేరలేదని, ఇప్పటికీ బీ ఆర్ ఎస్ లోనే ఉన్నానని, తాను వేసుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని, దేవుడి కండువా అని ప్రస్తుతం ఆయన సర్ది చెప్పుకుంటున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిన ఫోటోలు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసినా విషయం ఎమ్మెల్యే బండ్ల మరిచిపోయినట్లు ఉన్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధి ఇలా బుకాయించడం ఎంత వరకు సమంజసం అని అందరూ అనుకుంటున్నారు. బీ ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన ఎమ్మెల్యే లు తిరిగి సొంత గూటికి వస్తారని ఈ సందర్బంగా కేటీఆర్ అన్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ లో ఇమడలేకే…!

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిన దగ్గర నుంచి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మద్దతు కరువైంది. బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నియోజకవర్గం లో బీసీ నేత, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ లో బలమైన నేతగా ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఆమె వెంటే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సరిత ఓటమి చెందారు.అయినా పట్టు వీడని సరిత కాంగ్రెస్ శ్రేణులను ఒక్క తాటి పైకి తెచ్చేందుకు ఎంతో శ్రమించారు. మొదటగా ఈమె కూడా బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి గద్వాల జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ పదవి సరిత కు రావడం తో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. కాలక్రమేణ ఓకే పార్టీ లో ఉన్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, సరిత మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. ఇద్దరు ఒకే పార్టీ లో ఉన్న ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే తీరు నచ్చక సరిత కాంగ్రెస్ పార్టీ లో చేరింది. అప్పటి నుంచి గద్వాల లో కాంగ్రెస్ పార్టీ కి సరిత పెద్ద దిక్కుగా మారింది. ఇది దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చింది. బీ ఆర్ ఎస్ నుంచి కృష్ణ మోహన్ రెడ్డి పోటీ చేయడం.. కాంగ్రెస్ నుంచి సరిత పోటీలో ఉండడం తో గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. బీ ఆర్ ఎస్ కు లోలోన బీజేపీ మద్దతుగా నిలవడం తో కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో 14 అసెంబ్లీ స్థానాల్లో గద్వాల, అలంపూర్ మాత్రమే బీ ఆర్ ఎస్ గెలుపొందింది. ఈ సమయం లో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు కాంగ్రెస్ అధిష్టానం తో లాబీయింగ్ మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసు కున్న సరిత ఆయన చేరికను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరితే తాము కాంగ్రెస్ పార్టీ ని వదులుకుంటామని సరిత అధిష్టానం నేతలకు అల్టిమెటం ఇచ్చింది. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని రాజకీయంగా సరిత కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా వినక పోవడం తో ఎంపీ మల్లు రవి రంగం లోకి దిగి సరిత ను ఒప్పించి కృష్ణ మోహన్ రెడ్డి చేరికకు మార్గం సుగమనం చేశారు. వెంటనే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా వేసుకున్నారు. సీఎం స్థాయి వ్యక్తి గద్వాల కాంగ్రెస్ పార్టీ నేతలను బుజ్జగించి కృష్ణ మోహన్ రెడ్డి ని పార్టీ లో చేర్చుకున్నారు. పార్టీ లో చేరినా ఎమ్మెల్యే కు గద్వాల కాంగ్రెస్ శ్రేణుల నుంచి మద్దతు లేకపోవడం తో కాంగ్రెస్ లో ఇమడలేక మళ్ళీ సొంత పార్టీ అయిన బీ ఆర్ ఎస్ వైపు వెళ్ళారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడడం తో గద్వాల నియోజకవర్గం లో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.