TELANGANA Assembly | సవరణ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేయండి : సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సవరణ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

పార్లమెంటులో ప్రధాని ప్రకటన చేయాలి
27న నీతి ఆయోగ్ మీటింగ్ బాయ్‌కాట్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
బడ్జెట్‌లో అన్యాయంపై తీర్మానం ప్రతిపాదన
ఆమోదించిన సభ.. బీఆరెస్ మద్దతు
వాకౌట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
విధాత, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, సవరణ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తామని సీఎం వెల్లడించారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష బీఆరెస్ మద్దతునివ్వగా, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. తీర్మానం ఆమోదం అనంతరం సభను గురువారం మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. తెలంగాణపై కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు, నిధుల కేటాయింపు, అనుమతులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం సవరణ బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 27న జరిగే నీతి అయోగ్ సమావేశాలను తెలంగాణ సీఎంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణపై కేంద్రం వైఖరి వివక్ష కాదని, మూమ్మాటికి కక్ష చర్యనే అని సీఎం పునరుద్ఘాటించారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం కాపాడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు సమాఖ్య స్ఫూర్తిని కాపాడిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించిందని తెలిపారు. భాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు. ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారని, వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.
పెద్దలందరినీ కలిసి వినతులు ఇచ్చాం
రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు ఇచ్చామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తనకు ముఖ్యమంత్రి పదవి రాలేదని స్పష్టం చేశారు. ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిసానని.. 18సార్లు కేంద్ర మంత్రులను కలిసి, తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశా తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారని.. కేంద్రంలోని బీజేపీ మన హక్కులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రాన్ని గత పదేళ్లుగా అడగాల్సిన గత ప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలేదన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేలా తాము ప్రధాని మోదీని కలిసి నిధులు అడిగాం అన్నారు. తాను స్వయంగా మూడుసార్లు సీఎంను, కేంద్ర మంత్రులను కలిసి నిధులు కోరినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలియాలన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 30 పైసలు కూడా రావట్లేదని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయని… కేంద్రం మాత్రం తెలంగాణకు పదేళ్లలో కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలేనని.. బీహార్ కు రూ.7.26 పైసలు వెళుతున్నాయని తెలిపారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి రూ.22.66 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయని తెలిపారు. పదేళ్లలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. యూపీ నుంచి రూ.3.47 లక్షల కోట్ల పన్నులు వస్తే.. అక్కడ ఖర్చు పెట్టింది రూ.6.91 లక్షల కోట్లు అన్నారు. దేశంలో అభివృద్ధి, ఆదాయంలో తెలంగాణది ఎంతో కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఎంతో కీలకమైన హైదరాబాద్‌కు నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అందరం ఏకతాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచాలి.. నిధులు సాదించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్ధిక సంఘం చెప్పిందని తెలిపారు. కేంద్రం మాత్రం రాష్ట్రాలకు 32 శాతం పన్నులనే పంచుతోందని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణకు రావాల్సిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఐఐఎం, నవోదయ పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ సహా అన్ని విభజన హామీలు, ఇతర అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని శాసన సభ ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
శాసన సభ ఆమోదించిన తీర్మానం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశ అన్ని రాష్ట్రాల సమాఖ్య అని, అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని తీర్మానంలో గుర్తు చేశారు. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగిందిని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తీర్మానం పేర్కొన్నది. పార్లమెంట్‌లో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికే అమలు కాకపోవడం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపిందని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలుదపాలుగా ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిస్కృతంగా ఉన్న అంశాల పై అనేకసార్లు అభ్యర్థనలు అందించారని తీర్మానంలో గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపించిందని, అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తుందని పేర్కోన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తుందని పేర్కొన్నారు.