GO-49 | జీవో 49 ర‌ద్దు చేసిన సర్కారు.. సీఎంకు మంత్రుల ధన్యవాదాలు

GO-49 | జీవో 49 ర‌ద్దు చేసిన సర్కారు.. సీఎంకు మంత్రుల ధన్యవాదాలు

GO-49 | కొమురం భీం టైగ‌ర్ జోన్ పేరిట విడుద‌ల చేసిన జీవో 49ను నిలిపివేస్తున్నట్లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ జీవోకు వ్యతిరేకంగా ఆదివాసి గిరిజనుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడమే కాకుండా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సీఎం తాజా ప్రకటనపై మంత్రి సీతక్క, ఆదివాసి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. అటవీ బిడ్డలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని హామినిచ్చారు. 49 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా బంద్ విజ‌య‌వంతమైంది. గత కొంతకాలంగా జిల్లాలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ఆందోళన కొనసాగుతోంది.

కొద్ది రోజులక్రితం కొమురం భీం పేరుతో ఈ టైగ‌ర్ జోన్ ఏర్పాటు చేస్తూ 1492.88 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఆసిఫాబాద్‌, కాగ‌జ్ న‌గ‌ర్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ఆదివాసీ గూడాల‌ను, గ్రామాల‌ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆందోళన పెరిగింది. ఆసిఫాబాద్ డివిజ‌న్ లో 1,42,243.96 ఎక‌రాలు, కాగ‌జ్ న‌గ‌ర్ డివిజ‌న్ లో 2,26,655.77 ఎక‌రాలు రెండు డివిజ‌న్ల‌లో క‌లిపి 3,68,900 ఎక‌రాల‌ను ఈ జోన్ ప‌రిధిలోకి తీసుకొచ్చారు. ఈ జీవో ర‌ద్దు కోసం ఆదివాసీ మంత్రి సీత‌క్క , ఎమ్మెల్యేలు బాధ్య‌త‌ తీసుకుని పోరాడాల‌ని తాజాగా మావోయిస్టులు కూడా కోరారు. ఈ నేపథ్యంలో సీఎం జీవోను రద్దుచేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. సీంను కలిసిన వారిలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వెడమ బొజ్జూ, ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు.