Aasara Pensions | పెన్షన్ రికవరీపై వెనక్కి తగ్గిన సర్కార్‌

పెన్షన్‌ రికవరీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. త్వరలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, అప్పటి వరకు నోటీసులు ఇవ్వడం, మొత్తాన్ని రికవరీ చేయడంలాంటి చర్యలకు పూనుకోవద్దని సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

  • By: Tech |    telangana |    Published on : Jul 14, 2024 8:54 PM IST
Aasara Pensions | పెన్షన్ రికవరీపై వెనక్కి తగ్గిన సర్కార్‌

లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వొద్దు
కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు

విధాత, హైదరాబాద్‌: పెన్షన్‌ రికవరీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. త్వరలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, అప్పటి వరకు నోటీసులు ఇవ్వడం, మొత్తాన్ని రికవరీ చేయడంలాంటి చర్యలకు పూనుకోవద్దని సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఓ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను పొందే లబ్ధిదారుల్లో పలువురు అనర్హులు ఉన్నట్టు పలు మార్గాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చింది.

పథకాలను మరింత సమర్థవంతంగా, అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు వీలుగా ఈ పథకాల అమలు తీరును క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగుగా, సమర్థవంతంగా పథకాలను వర్తింపచేసేందుకు రాష్ట్ర శాసనసభ రాబోయే బడ్జెట్ సమావేశాలలో, పధకాల అమలులో గుర్తించిన అవకతవకలను చర్చించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత మెరుగ్గా అందించడం, అనర్హులు పొందుతున్న ప్రయోజనాలను గుర్తించి, వాటిని రికవరీ చేసే విధానాలకై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది.’అని ఆ ప్రకటనలో వివరించారు. ఈ మార్గదర్శకాలను జారీ చేసే వరకు వివిధ సంక్షేమ పథకాలలో లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం, లేదా మొత్తాలను రికవరీ చేయడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సచివాలయంలో అన్నివిభాగాలకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలను జారీ  చేసింది.