నాడు ఏమైందీ నీ ఫిరాయింపుల నీతి.. నేడు ఎందుకీ పెడ బొబ్బలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌

పార్టీ ఫిరాయింపుల పైన కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు

నాడు ఏమైందీ నీ ఫిరాయింపుల నీతి.. నేడు ఎందుకీ పెడ బొబ్బలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌

ఫిరాయింపులపై కేటీఆర్‌ది మొసలి కన్నీరు
త్వరలో కాంగ్రెస్‌లోకి మరింత మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేల చేరికలు

విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల పైన కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీఎల్పీని బీఆరెస్‌లో అక్రమంగా విలీనం చేసుకుని టీడీపీ ఎమ్మెల్యే తలసాని మంత్రి గా చేసినప్పుడు కేసీఆర్‌ను ఎందుకు కేటీఆర్ నిలదీయలేదని, 2019 లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను చేర్చుకుని, దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో కేటీఆర్ చెప్పాలన్నారు. నాడు మీ ఫిరాయింపుల నీతి..ప్రజాస్వామ్యం పరిరక్షణ ఎటు పోయిందని, నేడు ఎందుకీ పెడబొబ్బలని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆరెస్‌ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

పార్టీ మారుతున్న బీఆరెస్‌ ఎమ్మెల్యేలతో కేసీఆర్ తన ఫౌమ్ హౌస్‌లో వీడ్కోలు పార్టీలు ఇస్తు.. బంతి భోజనాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే లకు ప్రగతి భవన్ గేట్లు ఎందుకు తెరుచుకోలేదని ఆయన ప్రశ్నించారు. టీఆరెస్ పేరు కాస్తా బీఆరెస్‌గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధం తెగిపోయిందనన్నారు. రేవంత్ రెడ్డి తుఫాన్ లో బీఆరెస్‌ కొట్టుకుపోతుందన్నారు ఆది శ్రీనివాస్. బీఆరెస్‌ మునిగిపోతున్న నావ…ఆ నావలో ఎవరూ ఉండరని, అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే లను కేసీఆర్ హీనాతిహీనంగా చూశారన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు గౌరవం ఇస్తున్నారని, బీఆరెస్‌లో మిగిలేది ఆ నలుగురు మాత్రమేనని, త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన ఉన్న గౌరవంతోనే మా సీఎం ఆయన ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. ఫామ్ హౌస్‌లో భేటీల పేరుతో కేసీఆర్ బీఆరెస్‌ ఎమ్మెల్యేల పైన కపట ప్రేమ చూపిస్తున్నారని, ఇంత కాలం ఎమ్మెల్యేలకు కేసీఆర్ కనీస గౌరవం ఇవ్వలేదన్న సంగతి విస్మరించరాదన్నారు. కేసీఆర్ విందు భోజనాల పేరిట ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నట్లుందని ఆరోపించారు. గతంలో మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కేటీఆర్ కు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? అంటూ ప్రశ్నించారు. పొన్నంపై కౌశిక్ రెడ్డి చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని అగ్రహం వ్యక్తం చేశారు. అసలు కౌశిక్ రెడ్డికి పొన్నం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నారు ప్రగతి భవన్ కంచెలు తాకకుండా దుర్మార్గమైన పాలన చేశారని, మళ్లీ గడిలను కట్టడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. బీజేపీతో కలిసి కేసీఆర్ అనేక కుట్రలు చేశారని, లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్‌ గట్టి బుద్ధి చెప్పారన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి తుఫాన్ లో కొట్టుకుపోతారన్నారు. గతంలో కేసీఆర్ ఎమ్మెల్యే లను ప్రలోభపెట్టి కొనుగోలు చేసిన సంగతి మరువరాదన్నారు. మ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదం మా అంతర్గతమని, జీవన్ రెడ్డి సీనియర్ నేత, గొప్ప నాయకుడు… ఆయన పైన సీఎం రేవంత్ రెడ్డికి అమిత గౌరవం ఉందన్నారు.