భూ సేకరణకు గ్రామ స‌భ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.. ప్ర‌భుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు

భూ సేకరణకు గ్రామ స‌భ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.. ప్ర‌భుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు

పిటిష‌న్‌ను అనుమ‌తిస్తూ తీర్పునిచ్చిన న్యాయ‌స్థానం

విధాత‌, హైద‌రాబాద్: భూ సేకరణ ప్రాథమిక నోటిఫికేషన్‌కు గ్రామ సభ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుత పిటిషన్‌కు వర్తిస్తాయని పేర్కొంది. చట్టాన్ని పాటించకుండా ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.



నిబంధనలు పాటించకుండా, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి మణుగూరు, సమితి సింగారం గ్రామాల్లోని తమ భూముల స్వాధీన ప్రక్రియను అధికారులు చేపట్టారని ఆరోపిస్తూ మణుగూరుకు చెందిన సోడే సీతమ్మతో పాటు మరో 22 మంది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్ బుధ‌వారం విచారణ చేపట్టారు.



మణుగూరు రైల్వే స్టేషన్‌ నుంచి భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ వరకు రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టారని, దీనిలో భాగంగా చట్టవిరుద్ధంగా పిటిషనర్ల భూమిని సేకరిస్తున్నారని వారి తరఫున న్యాయవాది సీహెచ్‌ రవికుమార్‌ వాదనలు వినిపించారు.



2019, జూన్‌ 16న, 19న భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ జారీ చేసిన నోటిఫికేన్‌ను రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. భూ సేకరణ చట్టం సెక్ష‌న్‌ 41(3) ప్రకారం షెడ్యూల్డ్‌ ఏరియాలోని భూ సేకరణకు గ్రామ సభ అనుమతి తప్పనిసరి స్పష్టం చేశారు. ఈ మేరకు నోటిఫికేన్‌ను రద్దు చేస్తూ, పిటిషన్‌ను అనుమతిస్తున్నట్లు తీర్పునిచ్చారు.