నాగార్జునసాగర్‌కు.. రెండింతల పరిణామంలో నీరు.. ఎక్కడంటే..

విధాత : రాష్ట్రంలో భూగర్భ జలాల పరిమాణం గణనీయంగా వృద్ధి చెందిందని తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖ వెల్లడించింది. ఈ పరిమాణం రెండు నాగార్జున సాగర్ జలాశయాలతో సమానమని పేర్కొన్నది. భూగర్భ జలాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది.
భూగర్భ జలమట్టంపై రూపొందించిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ -2023 నివేదికను ఈ సమావేశం ఆమోదించింది. 2013లో రాష్ట్ర భూభాగంలో472 టీఎంసీల జలాలు ఉండగా, 2023 లో 56 శాతం వృధ్ధి చెంది, 739 టీఎంసీలకు చేరాయని ఈ నివేదిక పేర్కొన్నది.
మిషన్ భగీరథ, కాళేశ్వరం ఎత్తిపోతలు, కృత్రిమ భూగర్భ జలాల రీచార్జ్ ద్వారా ఇది సాధ్యమైందని తెలిపింది. వీటి ద్వారా రాష్ట్ర భూగర్భజల మట్టం సగటున నాలుగు శాతం వృధ్ధి చెందిందని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
దేశంలోనే అత్యధికంగా తెలంగాణా లో83 శాతం మండలాల్లో భూగర్భ జలాల పెరుగుదల నమోదవడం రికార్డుగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో భూగర్భ జల వనరులశాఖ డైరెక్టర్ ఎన్ శంకర్, కేంద్ర భూగర్భ జలవనరుల బోర్డు ప్రాంతీయ డైరెక్టర్ జి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.